Akwan Cyclone : అర్నబ్, మురసు వంటి వరుస తుపానులతో ఏపీలోని పలు ప్రాంతాలు అనేక రంగాల్లో దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీవైపు మరో తుపాను దూసుకొస్తుంది. దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి అక్వాన్ గా నామకరణం చేశారు.

Also Read : Pawan Kalyan Election Strategy : ఏపీలో రెండో విడత పురపోరుకు జనసేన రెడీ.. పవన్ కల్యాణ్ టార్గెట్ ఫిక్స్! మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

ఏపీవైపు అక్వాన్ తుపాను దూసుకొస్తోంది. ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ సైక్లోన్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం తుపాను గంటకు 10 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు (మంగళవారం) సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, ఈ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ప్రస్తుతం తుపాను ​చెన్నైకి 610 కిలో మీటర్లు, మచిలీపట్టణంకు 660 కిలో మీటర్లు, విశాఖపట్టణంకు 670 కిలో మీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ​ఉందని, శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అప్పుడప్పుడు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అక్వాన్ తుపాను ఏపీవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వాతావరణ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం, వర్ష సూచనలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను కదలిక, వాతావరణ పరిస్థితులను బట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని, అవసరమైన చోట సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.