IPL 2027 Retention Deadline: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు కీలక మార్పులు చేస్తున్నాయి. డిసెంబర్‌లో గోవాలో మినీ వేలం జరగనుండగా.. నేడు (నవంబర్ 17) అన్ని జట్లు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక ట్రేడ్స్ జరిగాయి. రిటెన్షన్ గడువు ముగిసిన తర్వాత కూడా ట్రేడింగ్ విండో కొనసాగనుంది. వేలానికి వారం రోజుల ముందు వరకు ఆటగాళ్లను అటూ ఇటూ మార్చుకునే అవకాశం ఉంది.

రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ట్రేడ్

2026 సీజన్ ముగిసిన తర్వాత తొలి కీలక ట్రేడ్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. రిషబ్ పంత్ లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లగా.. కుల్దీప్ యాదవ్ ఢిల్లీ నుంచి లక్నో జట్టులో చేరారు. లక్నోలో రూ.27 కోట్లు అందుకున్న పంత్.. ఢిల్లీ జట్టులో రూ.15 కోట్లకు చేరారు. కుల్దీప్ యాదవ్‌కు రూ.13.50 కోట్లకు ఖరారైంది.

సన్‌రైజర్స్, ఢిల్లీ మధ్య ట్రేడ్

రెండో ట్రేడ్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఢిల్లీకి చెందిన నటరాజన్ సన్‌రైజర్స్‌లో చేరగా, హైదరాబాద్ ఆటగాడు జీషన్ అన్సారీ ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. నటరాజన్ గతంలో రూ.10.75 కోట్లు అందుకోగా, ఈసారి రూ.5 కోట్లకు ట్రేడ్ అయ్యాడు. జీషన్ అన్సారీ జీతంలో ఎలాంటి మార్పు లేదు.

చెన్నై, హైదరాబాద్ మధ్య నలుగురు ఆటగాళ్ల మార్పిడి

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మరో కీలక ట్రేడ్ జరిగింది. లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులో చేరగా.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ హైదరాబాద్ జట్టుకు వెళ్లారు. లివింగ్‌స్టోన్ గతంలో రూ.13 కోట్లు అందుకోగా, ఇప్పుడు రూ.6 కోట్లకు చెన్నైలో చేరాడు. జాక్ ఎడ్వర్డ్స్ జీతం రూ.3 కోట్లుగా కొనసాగనుంది. ఖలీల్ అహ్మద్‌కు రూ.4.8 కోట్లు, నాథన్ ఎల్లిస్‌కు రూ.2 కోట్ల మార్పు లేదు.

హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ ట్రేడ్

ఇప్పటివరకు అత్యంత చర్చనీయాంశంగా మారిన ట్రేడ్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌లో చేరగా, పంజాబ్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి వచ్చాడు. హార్దిక్ గతంలో రూ.16.35 కోట్లు అందుకోగా.. పంజాబ్ అతడిని రూ.18 కోట్లకు తీసుకుంది. అర్ష్‌దీప్ సింగ్ కూడా రూ.18 కోట్లుగానే కొనసాగనుంది. ఇలా ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే పలు జట్ల మధ్య కీలక ఆటగాళ్ల మార్పిడి జరిగింది. రిటెన్షన్ జాబితాలు విడుదలైన తర్వాత మరిన్ని ట్రేడ్స్ జరిగే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.