ఆకాశంలో ఎగురుతున్న ఓ భారీ విమానం.. దాని చుట్టూ అకస్మాత్తుగా మూడు కాంతి గోళాలు ప్రత్యక్షమయ్యాయి. అవి విమానం చుట్టూ తిరుగుతూ ఏదో వింత శక్తిని ప్రయోగించాయి. అంతే.. చూస్తుండగానే విమానం ఒక్కసారిగా మాయమైపోయింది! వినడానికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తోంది  కానీ 2014లో అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ MH370 విమానం విషయంలో ఇదే జరిగిందని ఓ వ్యక్తి సంచలన వాదన చేస్తున్నాడు. ఏకంగా అమెరికానే ఆ విమానాన్ని టెలిపోర్ట్ చేసిందని ఆరోపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తన దగ్గర ఉందని చెబుతున్నాడు. ఈ వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మూడు కాంతి గోళాలు.. ఒక్కసారిగా మాయమైన విమానం!

ఆస్టన్ ఫోర్బ్స్ అనే వ్యక్తి 2023 నుంచి ఈ వింత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడు. అతడి కథనం ప్రకారం 239 మందితో ప్రయాణిస్తున్న బోయింగ్ 777 విమానం చుట్టూ మూడు గుర్తుతెలియని కాంతి గోళాలు (Orbs) తిరిగాయి. ఆ తర్వాత అవి ఓ పోర్టల్‌ను తెరిచి విమానాన్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అక్కడి నుంచి భూమిపై ఉన్న మరో ప్రాంతానికి తరలించాయి. ఆ ప్రాంతం డీగో గార్సియా అని అతడు చెబుతున్నాడు.

తన వాదనకు ఆధారంగా ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఓ విమానం చుట్టూ మూడు కాంతి గోళాలు తిరుగుతూ కనిపిస్తాయి. కొద్దిసేపటికే విమానం అదృశ్యమైనట్లు దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో నిజమైనదేనని, విమానం మాయమైన అసలు రహస్యం ఇదేనని ఫోర్బ్స్ గట్టిగా చెబుతున్నాడు.

Yes, these videos are real.

I have mixed feelings over exposing the United States’ most secret superweapon but they used it on a civilian airliner.

They’ve cracked gravity, solved fusion, and now they have coherent plasma drones that can create formations using magnet inversion.

There’s also a lot of people who deserve to be vindicated especially the engineers who have been saying all this for decades.

— Ashton Forbes (@AshtonForbes) April 28, 2025

చైనాపై ఆధిపత్యం కోసమే అమెరికా ప్రయోగం చేసిందా?

ఈ వ్యవహారం వెనుక అమెరికా ఉందన్నది ఫోర్బ్స్ చేస్తున్న మరో సంచలన ఆరోపణ. చైనాపై తన సాంకేతిక ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అమెరికా ఈ రహస్య ప్రయోగం చేసిందని అతడు అంటున్నాడు. గురుత్వాకర్షణ శక్తిని నియంత్రించే సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు, ఫ్యూజన్ టెక్నాలజీ, ప్లాస్మా డ్రోన్ల సాయంతో ఇలాంటి అద్భుతాలు చేయగల సామర్థ్యాన్ని అమెరికా సాధించిందని వాదిస్తున్నాడు. 2025లో ఈ వీడియోలను షేర్ చేస్తూ.. ‘ఈ వీడియోలు నిజమైనవే. సూపర్ వెపన్‌ను అత్యంత రహస్యంగా ఉంచిన అమెరికా ఓ పౌర విమానంపై ఉపయోగించింది’ అంటూ తెలిపాడు.

తాజాగా నవంబర్ 16న ఎక్స్‌లో మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ‘అమెరికా ఆ అదృశ్యమైన మలేషియా విమానాన్ని టెలిపోర్ట్ చేసింది. అందుకే దాన్ని మనం కనుగొనలేకపోయాం. ప్రాథమిక భౌతిక శాస్త్రం, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా అది ఎక్కడ ఉందో నేను గుర్తించగలిగాను’ అంటూ రాసుకొచ్చాడు. విమానం చాగోస్ దీవుల సమీపంలోని సముద్రంలో ఉందని మరో వాదన చేశాడు. విమాన శకలాలు ఆఫ్రికా తీరాలకు కొట్టుకురావడానికి కారణం కూడా విమానం ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండటమేనని పేర్కొన్నాడు.

The United States teleported that missing Malaysian airliner, that’s why we didn’t find it.

I was able to do the impossible and figure out where its resting based on fundamental physics and simple witness testimony.

The plane is in the water in the Chagos, it’s obvious.

The debris showed up in Africa because the plane is much closer than previously considered.

— Ashton Forbes (@AshtonForbes) November 16, 2026

3 లక్షల మంది ఫాలోవర్లు.. యూట్యూబ్‌లోనూ భారీ క్రేజ్!

ఆస్టన్ ఫోర్బ్స్ చేస్తున్న ఈ వాదనలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అతడికి ఎక్స్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో లక్ష మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే అతడి సిద్ధాంతాన్ని అందరూ నమ్మడం లేదు. ముఖ్యంగా విమానయాన రంగ నిపుణులు, సాంకేతిక విశ్లేషకులు ఈ వీడియోలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు.

వైరల్ వీడియో  ఏఐ సృష్టి?

ఫోర్బ్స్ షేర్ చేసిన వీడియోను నిపుణులు విశ్లేషించగా పలు అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. ‘స్కెప్టికల్ ఇన్‌క్వైరర్’కు చెందిన మిక్ వెస్ట్ ఈ వీడియోను పరిశీలించి, ఇందులోని దృశ్యాలు ఎడిట్ చేసినవని అన్నారు. ముఖ్యంగా విమానం అదృశ్యమయ్యే సమయంలో కనిపించే కాంతి ప్రభావం 1990లలో రూపొందించిన ‘పైరోమానియా’ అనే విజువల్ ఎఫెక్ట్స్ కలెక్షన్‌లోని దృశ్యాలతో పోలి ఉందని గుర్తించారు. వీడియోలో కనిపించే మేఘాల దృశ్యాలు కూడా 2012లో జపాన్ మీదుగా చిత్రీకరించిన స్టాక్ ఫుటేజ్‌తో సరిపోతున్నాయని తెలిపారు. ఇంకా కొన్ని సాంకేతిక లోపాలు కూడా ఉన్నాయని విశ్లేషించారు. విమానం వెనుక కనిపించే కాంతి రేఖలు దాని కదలికకు సంబంధం లేకుండా విడిగా కదులుతున్నట్లు ఉండటం, ఒకే వీడియో ఫ్రేమ్‌ను మార్చి రెండు వేర్వేరు దృశ్యాలుగా చూపించడం వంటి అంశాలు వీడియో నిజమైనది కాదనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని చెప్పారు.

విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ఆస్టన్ ఫోర్బ్స్!

నిపుణులు తన వీడియోను ఖండిస్తున్నప్పటికీ ఫోర్బ్స్ మాత్రం తన వాదనను వెనక్కి తీసుకోవడం లేదు. వీడియోలో కనిపించే మేఘాలు స్టాక్ ఫుటేజ్ నుంచి తీసుకున్నవేనని అంగీకరించాడు. అయితే తన వీడియోను తప్పుగా నిరూపించేందుకు ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆ దృశ్యాలను చేర్చారని ఆరోపిస్తున్నాడు.మీడియా, నిఘా సంస్థలు ప్రజలు తమ కళ్లతో చూసిన విషయాలను కూడా నమ్మకుండా ఉండేలా ప్రభావితం చేశాయని వ్యాఖ్యానిస్తున్నాడు. అయితే అతడి టెలిపోర్టేషన్ సిద్ధాంతానికి ఇప్పటివరకు ఎలాంటి విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలు లభించలేదు.

12 ఏళ్లుగా అంతుచిక్కని MH370 మిస్టరీ

2014 మార్చి 8న మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్‌కు MH370 విమానం బయలుదేరింది. ఇందులో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది కలిపి మొత్తం 239 మంది ఉన్నారు. అయితే ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది.ఆ తర్వాత విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉండవచ్చని భావించారు. విమానానికి చెందిన కొన్ని శకలాలు ఆఫ్రికా, పలు దీవుల తీరాలకు కొట్టుకొచ్చాయి. కానీ విమానం ప్రధాన శకలాలు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అందులో ప్రయాణించిన 239 మందికి ఏమైందన్నది కూడా పూర్తిగా తేలలేదు.

దీంతో ఈ ఘటనపై ఎన్నో ఊహాగానాలు, సిద్ధాంతాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మూడు కాంతి గోళాలు, టెలిపోర్టేషన్, అమెరికా రహస్య ఆయుధం అంటూ ఆస్టన్ ఫోర్బ్స్ చేసిన వాదన మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఇవన్నీ అతడి వ్యక్తిగత ఆరోపణలు మాత్రమే విమానం టెలిపోర్ట్ అయిందనడానికి ఎలాంటి నిరూపితమైన ఆధారాలు లేవు. దశాబ్దం దాటినా MH370 మిస్టరీకి సమాధానం దొరకకపోవడంతో కొత్త కొత్త కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ అసలు నిజం ఏమిటన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది!