ఒక్కసారి ఊహించుకోండి. ఉదయం నిద్రలేవగానే మీ పెంపుడు పిల్లిని చూశారు. ఆ తర్వాత బయటకు వెళ్లి ఎవరిని చూసినా వారి ముఖాల్లో పిల్లి కళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా, ఏదో హారర్ సినిమా కథలా అనిపిస్తోంది కదూ! కానీ అమెరికాకు చెందిన ఓ 28 ఏళ్ల యువకుడికి నిజంగానే ఇలాంటి అనుభవం ఎదురవుతోంది. మనుషుల ముఖాల్లో తన పెంపుడు పిల్లి కళ్లు, వాటి ఆకారం, చారలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఉదయం మొదట ఎవరిని చూస్తాడో రోజంతా ఇతరుల ముఖాల్లోనూ వారి లక్షణాలే కనిపిస్తున్నాయి. బ్రెయిన్ సర్జరీ తర్వాత మొదలైన ఈ వింత పరిస్థితి ఇప్పుడు వైద్య పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది.
ఉదయం లేచి తన పిల్లిని చూస్తే మనుషుల ముఖాల్లోనూ పిల్లి కళ్లు!
అమెరికాకు చెందిన 28 ఏళ్ల కార్ల్‌కు లూనా అనే బూడిద రంగు చారలున్న పెంపుడు పిల్లి ఉంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే లూనా ముఖమే అతడికి మొదట కనిపిస్తుంది. అయితే కొన్ని రోజులుగా అతడికి ఓ విచిత్రమైన సమస్య ఎదురవుతోంది. ఉదయం లూనాను చూస్తే ఆ తర్వాత రోజంతా ఎదురయ్యే మనుషుల ముఖాల్లోనూ పిల్లి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లికి ఉండే బాదం గింజల ఆకారంలోని కళ్లు, పెద్దగా కనిపించే కనుపాపలు, ముఖంపై ఉండే చారలు ఎదుటివారి ముఖాల్లో కనిపిస్తున్నాయి. కేవలం ఎదురుగా ఉన్న వ్యక్తులకే కాదు ఆన్లైన్లో చూసే ఫొటోలు, వీడియోల్లోని మనుషుల ముఖాల్లోనూ ఇదే పరిస్థితి!
ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఉదయం మొదట తన పిల్లిని కాకుండా ఓ మనిషిని చూస్తే, ఆ వ్యక్తి ముఖంలోని లక్షణాలే ఆ తర్వాత కనిపించే ఇతరుల ముఖాల్లో కనిపిస్తున్నాయి. చివరకు తన పెంపుడు పిల్లి లూనా ముఖంలోనూ ఆ మనిషి ముఖ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదయం మొదట చూసిన ముఖం ఆ రోజంతా అతడి కళ్ల ముందు కనిపించే ఇతర ముఖాలపై ప్రభావం చూపిస్తోంది.
బ్రెయిన్ సర్జరీ తర్వాతే మొదలైన వింత సమస్య!
కార్ల్ అనుభవం కల్పిత కథ కాదు. అతడి పరిస్థితిపై పరిశోధకులు ‘కార్టెక్స్’ (Cortex) అనే వైద్య జర్నల్‌లో అధ్యయనాన్ని ప్రచురించారు. దాదాపు రెండేళ్ల క్రితం అతడికి మెదడులో శస్త్రచికిత్స జరిగింది. మెదడులో రక్తనాళాలకు సంబంధించిన ఓ సమస్య కారణంగా వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కార్ల్‌కు ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM) అనే సమస్య ఉంది. ఈ పరిస్థితిలో మెదడులో ధమనులు, సిరల మధ్య రక్తనాళాలు అసాధారణంగా చిక్కుకుపోతాయి. దీనివల్ల రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు చికిత్సలో భాగంగా వైద్యులు అతడి మెదడులోని కుడివైపు టెంపోరల్ లోబ్‌లో కొంత భాగాన్ని తొలగించారు. ముఖాలను గుర్తించడం, వాటి లక్షణాలను మెదడు విశ్లేషించడం వంటి ప్రక్రియల్లో ఈ భాగం కీలక పాత్ర పోషిస్తుంది. సర్జరీ తర్వాత కార్ల్‌కు ముఖాలు వక్రీకరించి కనిపించే సమస్య మొదలైంది.
అసలు ఈ వ్యాధి పేరేంటి?
కార్ల్ ఎదుర్కొంటున్న సమస్య వెనుక రెండు రకాల దృష్టి సంబంధిత పరిస్థితులు ఉన్నాయని పరిశోధకులు వివరించారు. మొదటిది ‘పాలినోప్సియా’ (Palinopsia). ఈ పరిస్థితిలో గతంలో చూసిన దృశ్యాలు లేదా వాటి లక్షణాలు మెదడులో కొనసాగుతూ, ఆ తర్వాత చూసే దృశ్యాల్లోనూ మళ్లీ కనిపిస్తాయి. అంటే ఒకసారి చూసిన దృశ్యం మన కళ్ల ముందే ఉన్నట్లు అనిపించవచ్చు.
రెండోది ‘ప్రోసోపోమెటామార్ఫోప్సియా’ (Prosopometamorphopsia). ఇందులో ఎదుటివారి ముఖాలు సహజంగా కనిపించకుండా వక్రీకరించినట్లు కనిపిస్తాయి. కళ్లు, ముక్కు, నోరు వంటి ముఖ లక్షణాలు మారినట్లు అనిపించవచ్చు. కార్ల్ విషయంలో ఈ రెండు పరిస్థితుల ప్రభావంతో గతంలో చూసిన ముఖ లక్షణాలు, ప్రస్తుతం చూస్తున్న వ్యక్తుల ముఖాలపై ప్రతిబింబిస్తున్నాయి. అందుకే కొన్నిసార్లు మనుషుల ముఖాల్లో పిల్లి కళ్లు కనిపిస్తుంటే.. మరికొన్నిసార్లు పిల్లి ముఖంలో మనిషి లక్షణాలు కనిపిస్తున్నాయి.
1986లోనూ వింత ఘటన.. బస్సులో అందరూ కుక్కల్లాగే కనిపించారు
ఈ కేసును పరిశీలిస్తున్న డార్ట్మౌత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రాడ్ డుచైన్కు 1986లో ప్రచురితమైన ఓ పరిశోధన గుర్తుకొచ్చింది. అప్పట్లో ఓ మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా, మరో ప్రయాణికుడి ఒడిలో ఉన్న పూడిల్ జాతి కుక్కను చూసింది. ఆ తర్వాత బస్సులో ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆ కుక్క ముఖమే కనిపించడం మొదలైంది. ఆ మహిళకు తొమ్మిది నెలల ముందు స్ట్రోక్ వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే కార్ల్ అనుభవం దీనికి కొంత భిన్నంగా ఉంది. అతడికి ఎదుటివారి పూర్తి ముఖం మరో ముఖంలా కనిపించడం లేదు. కేవలం కొన్ని లక్షణాలు మాత్రమే ఒకరి ముఖం నుంచి మరొకరి ముఖానికి మారుతున్నాయి.
ఈ విషయంపై బ్రాడ్ డుచైన్ మాట్లాడుతూ, కార్ల్ తన పిల్లి లక్షణాలను మనుషుల ముఖాల్లో చూడటం, అలాగే మనుషుల ముఖ లక్షణాలను పిల్లి ముఖంలో చూడటం ద్వారా మన జ్ఞాపకాలు మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవచ్చని వివరించారు.
ఏఐతో బాధితుడి అనుభవానికి చిత్రరూపం!
కార్ల్ ఏం చూస్తున్నాడో ఇతరులకు అర్థమయ్యేలా వివరించడం పరిశోధకులకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే అతడు చూస్తున్న ముఖాలు సాధారణంగా మనకు కనిపించే ముఖాల్లా ఉండవు. దీంతో బ్రాడ్ డుచైన్ మొదట ఓ చిత్రాన్ని స్వయంగా గీశారు. అనంతరం ఏఐ (Artificial Intelligence) సాయంతో దాన్ని మరింత సహజంగా కనిపించే చిత్రంగా మార్చారు. ఆ చిత్రాలను కార్ల్‌కు చూపించి, అతడి అనుభవానికి అనుగుణంగా ఇద్దరూ కలిసి మార్పులు చేశారు. చివరకు ఈ చిత్రాలను పరిశోధనా నివేదికలో చేర్చారు.
ఏఐ సాయంతో ఇలాంటి దృష్టి సమస్యలతో బాధపడేవారు ఏం చూస్తున్నారో మరింత కచ్చితంగా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడిందని పరిశోధకులు తెలిపారు. బాధితులు తమకు ఎదురవుతున్న అనుభవాలను చిత్రాల రూపంలో చూపించగలిగితే, వ్యాధిని అర్థం చేసుకోవడం, దానిపై పరిశోధన చేయడం మరింత సులభమవుతుందని డుచైన్ అభిప్రాయపడ్డారు.
మానసిక సమస్యగా పొరబడుతున్నారు.. 250 మంది బాధితుల ఆవేదన!
ఈ పరిశోధనలో మరో కీలక విషయం కూడా బయటపడింది. ముఖాలు వక్రీకరించి కనిపించే సమస్యతో బాధపడుతున్న సుమారు 250 మంది తమ ల్యాబ్‌ను సంప్రదించినట్లు బ్రాడ్ డుచైన్ వెల్లడించారు. అయితే వీరిలో చాలా మందికి అసలు సమస్య ఏమిటో గుర్తించకుండా మానసిక రుగ్మతగా పొరబడినట్లు తెలిపారు. కొందరికి యాంటీ సైకోటిక్ మందులు కూడా ఇచ్చినట్లు వివరించారు.
కానీ వాస్తవానికి వారిలో చాలామంది ఎదుర్కొంటున్నది మానసిక సమస్య కాదని, దృష్టి సంబంధిత సమస్య అని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాటిని సరిగ్గా గుర్తించి, తగిన వైద్య పరీక్షలు చేయించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
మొత్తానికి ఉదయం తన పెంపుడు పిల్లిని చూస్తే రోజంతా మనుషుల ముఖాల్లో పిల్లి లక్షణాలు కనిపించడం, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కార్ల్ జీవితంలో ఎదురవుతున్న వాస్తవం. మన మెదడు జ్ఞాపకాలను ఎలా నిల్వ చేస్తుంది? వాటి ఆధారంగా మనం చూసే ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాలపై ఈ అరుదైన కేసు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

