Danam Nagender Disqualification Gazette Khairatabad Seat:  తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన  ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు  న్యాయపరమైన చిక్కుల్లో పడింది. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడటం, దానిని సుప్రీంకోర్టు సైతం ఖరారు చేయడంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే, ఉపఎన్నికల నగారా మోగడానికి అంతా సిద్ధమైన తరుణంలో, కాంగ్రెస్ నాయకురాలు పి. విజయారెడ్డి  హైకోర్టులో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్  ఈ ప్రక్రియకు బ్రేకులు వేసింది. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ పరిష్కారమయ్యే వరకు ఉపఎన్నిక నిర్వహించవద్దని ఆమె కోర్టును ఆశ్రయించగా, పిటిషన్ తేలే వరకు ఉపఎన్నిక నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం సైతం హైకోర్టుకు స్పష్టం చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

ఎన్నిక లేకుండా విజయారెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటించే చాన్స్                   

ఈ వ్యవహారంలో అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. ఒకవేళ 2023లో జరిగిన దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇస్తే, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన పి. విజయారెడ్డిని నేరుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఏర్పడుతుంది. అదే జరిగితే, అసలు ఉపఎన్నిక నిర్వహించాల్సిన అవసరమే ఉండదు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డికి ఇలా నేరుగా ఎమ్మెల్యే పదవి దక్కితే, రాజకీయంగా తమకు తీరని నష్టం జరుగుతుందని భావించిన బీజేపీ నేత  చింతల రామచంద్రారెడ్డి  తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే కొట్టివేసి, ఖైరతాబాద్ ఉపఎన్నికకు మార్గం సుగమం చేయాలని కోరుతూ ఆయన న్యాయపోరాటానికి దిగారు.

మూడో స్థానంలో నిలిచిన చింతల                           

గత 2023 అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు 67,368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిని విజయారెడ్డి 45,358 ఓట్లతో రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 38,094 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. విజయారెడ్డి అభ్యర్థనను సవాలు చేస్తూ చింతల రామచంద్రారెడ్డి కోర్టు పిటిషన్‌లో బలమైన న్యాయపరమైన వాదనలను వినిపించారు. 2023 ఖైరతాబాద్ ఎన్నిక అనేది కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ద్వైపాక్షిక పోటీ కాదని, అది ఒక  బహుముఖ పోటీ   అని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు చారిత్రాత్మక తీర్పుల ప్రకారం, బహుముఖ పోటీ జరిగినప్పుడు విజేత ఎన్నిక రద్దయితే లేదా అనర్హతకు గురైతే రెండో స్థానంలో ఉన్న వ్యక్తిని నేరుగా విజేతగా ప్రకటించడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. విజేతకు పడిన వేలాది ఓట్లు కేవలం రెండో స్థానంలో ఉన్న వారికే వెళ్తాయని ఊహించలేమని, అందువల్ల ప్రజాభిప్రాయాన్ని మళ్లీ తెలుసుకునేందుకు ఉపఎన్నిక నిర్వహించడమే రాజ్యాంగబద్ధమైన మార్గమని చింతల తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ ఎన్నికల పిటిషన్ కారణంగా ఖైరతాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ అనవసరంగా ఆలస్యమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి లేకపోవడం వల్ల నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఉపఎన్నికను అడ్డుకోవడానికి లేదా ఆలస్యం చేయడానికే ఇలాంటి పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.                

కాంగ్రెస్ కు ఉపఎన్నిక ఇష్టం లేదు!

రాజకీయ కోణంలో చూస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్ ఉపఎన్నికను ఎదుర్కోవడం కంటే, న్యాయపరంగా విజయారెడ్డికి ఎమ్మెల్యే పదవి దక్కితేనే అత్యంత సురక్షితమని హస్తం పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలంగా ఉన్న బీజేపీ, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే గెలుపు తమదేనని ధీమాతో ఉంది. బీఆర్ఎస్ సైతం తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తోంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వెలువరించబోయే తీర్పుపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ హైకోర్టు చింతల రామచంద్రారెడ్డి వినిపించిన  బహుముఖ పోటీ  వాదనలతో ఏకీభవించి, విజయారెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తే.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు మార్గం సుగమమై హైదరాబాద్ రాజకీయాల్లో మరో హై-వోల్టేజ్ ఎన్నికల సమరానికి తెరలేవనుంది.