131st Constitutional Amendment Bill: దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జాతీయ రాజకీయాల్లో అనూహ్యమైన ఏకాభిప్రాయం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గత ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మూకుమ్మడిగా వ్యతిరేకించి అడ్డుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలు, ఇప్పుడు తమ వైఖరిని మార్చుకుని సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన కాకుండా, అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం ఫ్లాట్ పెంపు ప్రతిపాదనకు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే బహిరంగంగానే మద్దతు ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దాదాపుగా కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలన్నింటికీ ఓకే
ముంబైలో మీడియాతో మాట్లాడిన సుప్రియా సూలే, నియోజకవర్గాల విస్తీర్ణం, ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పాలన అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం బారామతిలో ఓటర్ల సంఖ్య 10–12 లక్షల నుంచి ఏకంగా 20–22 లక్షలకు చేరిందని, కేవలం రూ. 5 కోట్ల ఎంపీ నిధులతో ప్రతి గ్రామానికి న్యాయం చేయడం అసాధ్యమని ఆమె పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచితే ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, అందుకే ఈ ప్రతిపాదనను తమ పార్టీ సూత్రప్రాయంగా ఆమోదించిందని సూలే స్పష్టం చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్లను కూడా దీనితో అనుసంధానించి అమలు చేయాలని ఆమె సూచించారు.
50 శాతం పెంపు ఫార్ములాకు సానుకూలత
కేవలం ఎన్సీపీ మాత్రమే కాకుండా, ఇండియా కూటమిలోని ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం ఈ ఫార్ములాకు పరోక్షంగా సమ్మతి తెలుపుతున్నాయి. గత జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలు ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. 50 శాతం ఫ్లాట్ పెంపు ద్వారా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా తగ్గకుండా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంతో, ప్రాంతీయ పార్టీల్లో ఉన్న అభద్రతా భావం తొలగిపోయింది. దీనితో రాబోయే శీతాకాల సమావేశాల్లో గానీ, ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి గానీ ఈ బిల్లును సులభంగా ఆమోదించుకునేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కూడగట్టడంలో బీజేపీ దాదాపు విజయం సాధించినట్లే కనిపిస్తోంది.
ఒత్తిడిలో కాంగ్రెస్
ఈ పరిణామాలతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దాదాపు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుప్రియా సూలే వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. మీరు మద్దతు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి, కానీ కాంగ్రెస్ పేరును మాత్రం వాడకండి అని ఘాటుగా స్పందించారు. అసోం తరహాలో బీజేపీ తనకు అనుకూలంగా నియోజకవర్గాలను పునర్విభజించుకునే ప్రమాదం ఉందని, కులగణన ఆధారంగానే ప్రాతినిధ్యం ఉండాలని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. అయితే, సీట్ల పెంపు వల్ల తమ రాష్ట్రాలకు అదనపు ప్రాతినిధ్యం, నేతలకు కొత్త రాజకీయ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ అభ్యంతరాలను పట్టించుకునే స్థితిలో లేవు. ఒక కీలక రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో విపక్ష కూటమిలో ఏర్పడిన ఈ చీలిక బీజేపీకి బలమైన రాజకీయ అస్త్రంగా మారింది. మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రతిపాదనకు తలూపుతుండటంతో, కాంగ్రెస్ పార్టీ తన వ్యతిరేకతను కొనసాగిస్తే మహిళా రిజర్వేషన్లకు, ప్రజాస్వామ్య విస్తరణకు కాంగ్రెస్ అడ్డుపడుతోంది అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ తన పట్టును వీడి ఏకాభిప్రాయానికి వస్తుందా, లేక ఒంటరి పోరాటానికే సిద్ధమవుతుందా అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

