Kavitha Revanth Reddy Srujan Reddy Company Controversy:  తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం కేంద్రంగా నడుస్తున్న అంతర్గత పోరు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత  తెలంగాణ రక్షణ సేన పేరిట సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏకంగా  హరీశ్ రావు కంచుకోట అయిన సిద్దిపేట గడ్డపైనే అడుగుపెట్టి సంచలన ఆరోపణలు గుప్పించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టును భూకంప జోన్‌లో నిర్మించారని, రూ. 263.54 కోట్ల రికవరీకి విజిలెన్స్ సిఫార్సు చేసిందని, నిమ్స్ ఉద్యోగుల పీఎఫ్ నిధుల మళ్లింపు, కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాలువ తవ్వకం వంటి అంశాలను లేవనెత్తుతూ హరీశ్ రావు, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకోవడం బీఆర్ఎస్ శిబిరంలో కలకలం సృష్టించింది.

హరీష్ ను టార్గెట్ చేస్తున్న కవిత                               

కవిత చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్  తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. కవిత లేవనెత్తిన సాంకేతిక అంశాలకు వివరణ ఇస్తూనే, ఆమె వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలం ఉందని ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ బలంగా ప్రయత్నించింది. ముఖ్యంగా, రహస్యంగా ఉండాల్సిన ప్రభుత్వ విజిలెన్స్ నివేదికలు కవిత చేతికి ఎలా వెళ్లాయని ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్.. 2010–2012 మధ్యకాలంలో ఆడి కోర్ ఇన్‌ఫ్రా  అనే కంపెనీలో రేవంత్ రెడ్డి, కవిత, సూదిని సృజన్ రెడ్డి డైరెక్టర్లుగా పనిచేశారని, ఒకే చిరునామాతో 30 కంపెనీలు పెట్టారని కొన్ని పత్రాలను ప్రస్తావించారు. నవంబర్ 19న సిద్దిపేటలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు ముందుగా కవితను అక్కడికి పంపి, రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ఆమెతో చదివించారని ఆరోపిస్తూ, ఆమె రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు.

వ్యాపారమే చేయకుండా మూతపడిన కంపెనీ

అయితే, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపణలపై కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన వర్గాలు అంతే ఘాటుగా స్పందించాయి. కవిత చూపించిన కాగ్   నివేదికలు, పత్రాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో సింగిల్ క్లిక్‌తో దొరికేవేనని, ఒక్క రూపాయి వ్యాపారం కూడా చేయకుండానే మూతపడిన కంపెనీ పేరుతో కవితపై రేవంత్ రెడ్డి ముద్ర వేయడం ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడటమేనని తిప్పికొట్టాయి. గతంలో బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన ప్రవీణ్ కుమార్, ఇప్పుడు గులాబీ కండువా కప్పుకుని హరీశ్ రావుకు వంతపాడటం హాస్యాస్పదమని కవిత వర్గం కౌంటర్ ఇచ్చింది. ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టిన కవిత, సహజంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును ప్రధానంగా ప్రశ్నించాలి. కానీ, అందుకు భిన్నంగా ఆమె ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌ను, ముఖ్యంగా పార్టీలో అత్యంత కీలకమైన  హరీశ్ రావు, కేటీఆర్‌లను  మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. తనను పార్టీ నుంచి బయటకు పంపడంలో, తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడంలో వీరిద్దరి పాత్రే కీలకమని కవిత గట్టిగా భావిస్తున్నారు. అందుకే, తెలంగాణ గ్రామీణ ఓటు బ్యాంకుపై పట్టున్న బీఆర్ఎస్‌ను బలహీనపరిస్తేనే, ఆ ఆల్టర్నేటివ్ స్పేస్ లోకి తాను రాగలనని ఆమె లెక్కలు వేసుకుంటున్నారు.                

కాంగ్రెస్ పార్టీకి వరంగా మారిందా? 

 కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడిన ఈ నిట్టనిలువు చీలిక అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయాచిత వరంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయాన్ని, శక్తిని కవిత ఆరోపణలకు సమాధానం చెప్పుకోవడానికే వెచ్చించాల్సి వస్తోంది. పైగా, స్వయానా కేసీఆర్ కుమార్తెనే గత ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని, ఫామ్‌హౌస్‌కు అక్రమ కాలువ తవ్వారని బహిరంగంగా చెబుతుండటంతో, నవంబర్ 19న సిద్దిపేటలో జరగనున్న సభలో హరీశ్ రావును ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ నేతలకు కవిత మాటలే బలమైన ఆయుధాలుగా మారాయి.  కవిత సాగిస్తున్న ఈ రాజకీయ దాడి ప్రత్యక్షంగా హరీశ్ రావు, కేటీఆర్ నాయకత్వాన్ని దెబ్బతీసే లక్ష్యంతో సాగుతున్నప్పటికీ.. అంతిమంగా ప్రతిపక్ష ఓటు బ్యాంకును చీల్చి అధికార కాంగ్రెస్ పార్టీకే రాజకీయంగా మేలు చేకూరుస్తోందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కక్షల స్థాయికి చేరిన ఈ విమర్శల పర్వం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉనికికి, కవిత రాజకీయ భవిష్యత్తుకు ఏ విధమైన పరీక్ష పెట్టనుందో వేచి చూడాలి.