Cyclone Akwan Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుఫాన్‌గా బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ తుఫాన్ మరింత బలపడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నం, విశాఖపట్నం తీరాలకు దక్షిణ-ఆగ్నేయంగా సుమారు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్వాన్ తుఫాన్ ప్రస్తుతం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. అనంతరం తన దిశను మార్చుకుని మరింత బలాన్ని పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 20, 2026 మధ్యాహ్నం తర్వాత అతి తీవ్ర తుఫాన్‌గా మారి నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో ఏపీ తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
అప్రమత్తమైన కోనసీమ జిల్లా యంత్రాంగం
అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులు తమ పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రమాదకర ప్రాంతాలు, విరిగిపడే అవకాశం ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు
తుఫాన్ సహాయక చర్యలకు సంబంధించి ప్రజలు ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009ను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపింది. ఇక, తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. ప్రజలు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

