ONGC Gas Leak: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మామిడికుదురు మండలం గెద్దాడ–మామిడికుదురు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ బావి నుంచి ఈ తెల్లవారుజామున భారీగా గ్యాస్ వెలువడుతోంది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తున్నారు. ఊరంతా గ్యాస్ వాసన వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గెద్దాడ వద్ద జాతీయ రహదారిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ ఏడాది జనవరిలో ఇరుసుమండలో జరిగిన ఓఎన్జీసీ బ్లో అవుట్ ఘటనను ప్రజలు ఇంకా మరువకముందే మరోసారి ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఓఎన్జీసీ కార్యకలాపాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజా గ్యాస్ లీకేజీతో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.