Mohammed Shami To Move To RR: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌తో షమీని ట్రేడ్ చేసుకునేందుకు ఇరు ఫ్రాంచైజీలు అంగీకరించినట్లు క్రిక్‌ఇన్ఫో తన కథనంలో వెల్లడించింది. నేడు (నవంబర్ 17) ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ డీల్ ఆసక్తికరంగా మారింది. ఈ ట్రేడ్‌లో భాగంగా తమిళనాడుకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ కూడా లక్నో నుంచి రాజస్థాన్‌కు వెళ్లనున్నట్లు క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.
13 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు:
గత సెప్టెంబర్‌లో 36 ఏళ్లు పూర్తి చేసుకున్న మహమ్మద్ షమీ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2026లో లక్నో తరఫున అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. 13 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు మాత్రమే పడగొట్టిన షమీ.. ఓవర్‌కు సగటున 9 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ సీజన్‌లో లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు షమీ ప్రాతినిధ్యం వహించాడు.
జోఫ్రా ఆర్చర్‌తో కలిసి:
మరోవైపు మహమ్మద్ షమీ రాకతో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. కొత్త బంతితో వికెట్లు తీయగల షమీ.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌తో కలిసి ఆరంభంలో చెలరేగనున్నాడు. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్.. క్వాలిఫయర్-2లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. వచ్చే సీజన్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టు కూర్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సామ్ కరన్ లక్నో తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు గతంలో రెండేసి సార్లు ఆడిన కరన్‌కు లక్నో మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీ కానుంది. గాయంతో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ తరఫున అతడు ఆడలేకపోయాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల కరన్ జట్టుకు ఉపయోగపడతాడని లక్నో భావిస్తోంది.
కెప్టెన్ రేసులో కూడా కరన్:
లక్నోలో కరన్‌కు మరో ఆసక్తికరమైన అంశం కూడా కలిసిరానుంది. ఆ జట్టు గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న టామ్ మూడీతో అతడికి మంచి అనుబంధం ఉంది. గతంలో ది హండ్రెడ్ టోర్నీలో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరఫున, యూఏఈలోని ఐఎల్‌టీ20లో డెజర్ట్ వైపర్స్ తరఫున వీరిద్దరూ కలిసి పనిచేశారు. మూడీ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలోనే కరన్ కెప్టెన్సీలో డెజర్ట్ వైపర్స్ ఈ ఏడాది జనవరిలో ఐఎల్‌టీ20 టైటిల్‌ను గెలుచుకుంది. ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ విజయంలో కరన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడైనా ఆడగలగడం, బౌలింగ్‌లో వివిధ దశల్లో సేవలందించడం అతడి ప్రత్యేకత. అంతేకాదు లక్నో జట్టు తదుపరి కెప్టెన్ రేసులో కూడా కరన్ పేరు వినిపిస్తోంది.

