పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న శ్రేష్ఠ (SHRESHTA) పథకం ద్వారా ఎస్సీ, డీఎన్టీ (SC & DNT) వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు దేశంలోని ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం పొందవచ్చు. ఈ పథకం కింద 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) SHRESHTA NETS-2027 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. అర్హులైన విద్యార్థులు నవంబరు 30, 2026లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
SHRESHTA NETS-2027 వివరాలు
- పథకం పేరు: Residential Education for Students in High Schools in Targeted Areas (SHRESHTA) NETS-2027
- ప్రవేశాలు కల్పించే తరగతులు: 9వ తరగతి (Class IX), 11వ తరగతి (Class XI)
- ఎన్ని సీట్లు ఉన్నాయి: ఈ పథకం ద్వారా ఏటా సుమారు 2,400 మంది విద్యార్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ఎస్సీ (SC) విద్యార్థులు: 2,160 సీట్లు
- డీనోటిఫైడ్ ట్రైబ్స్ (DNT) విద్యార్థులు: 240 సీట్లు
2026-27 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం 8వ లేదా 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, డీఎన్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డీఎన్టీ కేటగిరీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లోకి రాని విద్యార్థులు మాత్రమే అర్హులు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. వయోపరిమితి 9వ తరగతిలో ప్రవేశానికి 31-03-2027 నాటికి 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అంటే 01-04-2011 నుంచి 31-03-2015 మధ్య జన్మించి ఉండాలి. 11వ తరగతిలో ప్రవేశానికి 31-03-2027 నాటికి 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అంటే 01-04-2009 నుంచి 31-03-2013 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
రాత పరీక్ష విధానం..
SHRESHTA NETS-2027 ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్ (పెన్ అండ్ పేపర్) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. గణితంలో 25 ప్రశ్నలకు 100 మార్కులు, సైన్స్‌లో 25 ప్రశ్నలకు 100 మార్కులు, సోషల్ స్టడీస్‌లో 25 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్ అవేర్నెస్/నాలెడ్జ్‌లో 25 ప్రశ్నలకు 100 మార్కులు చొప్పున మొత్తం100 ప్రశ్నలకు 400 మార్కుకు పరీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానాలకు, సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. 11వ తరగతి ప్రవేశ పరీక్షకు ఎన్సీఈఆర్టీ 10వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 14, 2026.
- దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026.
- దరఖాస్తుల సవరణ: డిసెంబర్ 2, 2026 నుంచి డిసెంబర్ 4, 2026.
- పరీక్ష నగర వివరాలు: డిసెంబర్ 20, 2026.
- హాల్‌టికెట్ల డౌన్లోడ్: జనవరి 3, 2027.
- ప్రవేశ పరీక్ష: జనవరి 10, 2027.
ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాణ్యమైన విద్యకు దూరమవుతున్న ఎస్సీ, డీఎన్టీ విద్యార్థులకు SHRESHTA పథకం మంచి అవకాశంగా నిలుస్తుంది. అర్హులైన విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా నవంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం NTA అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన SHRESHTA NETS-2027 సమాచారాన్ని పరిశీలించాలి.
SHRESHTA NETS-2027 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

