Dell XPS 16 Creator Edition Launch: ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ (Dell) భారత మార్కెట్లోకి మరో ప్రీమియం ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. కంటెంట్ క్రియేటర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఏఐ నిపుణులు, ప్రొఫెషనల్ ఎడిటర్లను లక్ష్యంగా చేసుకుని Dell XPS 16 Creator Editionను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక NVIDIA RTX Spark ప్లాట్‌ఫామ్, శక్తివంతమైన ప్రాసెసర్, 3.2K టాండమ్ OLED టచ్‌స్క్రీన్ వంటి ప్రత్యేకతలతో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. Blender, DaVinci Resolve, Adobe Photoshop వంటి హెవీ క్రియేటివ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. భారీ AI మోడల్స్, 3D డిజైనింగ్, 8K వీడియో ఎడిటింగ్ వంటి పనులను కూడా నిర్వహించే సామర్థ్యంతో దీనిని తీసుకొచ్చింది.

భారత్‌లో Dell XPS 16 Creator Edition ప్రారంభ ధర రూ.4,49,990గా నిర్ణయించారు. ఇప్పటికే డెల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. డిసెంబర్ మధ్య నాటికి డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఇతర రిటైల్ దుకాణాలు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులోకి రానుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా అర్హత కలిగిన Axis Bank, ICICI Bank కార్డులపై గరిష్ఠంగా రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అలాగే జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16 అంగుళాల 3.2K టాండమ్ OLED టచ్‌స్క్రీన్ అందించారు. ఇది 20Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.

డిస్‌ప్లేలోని ఇతర ప్రత్యేకతలు:

3.2K రిజల్యూషన్.
120Hz వరకు రిఫ్రెష్ రేట్.
గరిష్ఠంగా 1,000 నిట్స్ బ్రైట్‌నెస్.
VESA DisplayHDR True Black 600 సర్టిఫికేషన్.
100 శాతం DCI-P3 కలర్ గామట్ కవరేజ్.
Delta E 2 కంటే తక్కువ కలర్ అక్యురసీ.
Pantone Validated సర్టిఫికేషన్.

ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్, వీడియో కలర్ గ్రేడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ చేసే వారికి ఈ డిస్‌ప్లే ఉపయోగపడుతుంది. Dell XPS 16లో NVIDIA RTX Spark ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో Blackwell ఆర్కిటెక్చర్ ఆధారిత RTX GPU, Grace CPU ఉంటాయి. GPUలో గరిష్ఠంగా 6,144 కోర్లు, Grace CPUలో 20 కోర్ల వరకు ఉంటాయి. అలాగే 128GB వరకు యూనిఫైడ్ మెమరీ, 2TB వరకు TLC NVMe M.2 PCIe Gen 5 SSD స్టోరేజ్‌కు మద్దతు ఉంది.

భారీ AI మోడల్స్‌ను రన్ చేయడం, క్లిష్టమైన 3D సీన్లను రూపొందించడం, 8K వీడియో ఎడిటింగ్ వంటి పనులను నిర్వహించేందుకు ఈ హార్డ్‌వేర్‌ను రూపొందించినట్లు డెల్ తెలిపింది. అంతేకాకుండా Real-Time Ray Tracing, DLSS టెక్నాలజీ, హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ 4:2:2 వీడియో ఎన్‌కోడింగ్, డీకోడింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా ఈ ల్యాప్‌టాప్‌లో మూడు USB4 Type-C పోర్టులు ఇచ్చారు. వీటికి DisplayPort 2.1, Power Delivery సపోర్ట్ ఉంటుంది.

ఇతర కనెక్టివిటీ ఫీచర్లు:

HDMI 2.1b పోర్ట్.
ఫుల్ సైజ్ కార్డ్ రీడర్.
యూనివర్సల్ ఆడియో జాక్.
ఒకేసారి మూడు ఎక్స్‌టర్నల్ మానిటర్లను కనెక్ట్ చేసుకునే సదుపాయం.
ఏదైనా USB-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకునే అవకాశం.

సాఫ్ట్‌వేర్ పరంగా GitHub Copilot, Claude Code, ComfyUI, Cursor వంటి AI, డెవలప్‌మెంట్ టూల్స్‌కు సపోర్ట్ ఉంటుంది. Blender, DaVinci Resolve, Adobe Photoshop, Adobe Premiere వంటి క్రియేటివ్ అప్లికేషన్లను కూడా ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 99Wh బ్యాటరీ అందించారు. బాక్స్‌లో 130W USB Type-C ఛార్జర్‌ను అందిస్తున్నారు. పూర్తిగా అల్యూమినియంతో రూపొందించిన దీని బాడీ మందం కేవలం 17.8 మిల్లీమీటర్లు.