Madurai Section 144: తమిళనాడులోని మధురైలో తిరుప్పరంకుండ్రం కార్తీక మహాదీపం ఉత్సవం నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మధురై జిల్లా కలెక్టర్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. నవంబర్ 23వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిషేధాజ్ఞల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. అలాగే సాధారణ ప్రజలు తిరుప్పరంకుండ్రం కొండపైకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కార్తీక మహాదీపం ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నవంబర్ 24న దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే పరిమిత సంఖ్యలో ప్రతినిధులు, అధికారులు మాత్రమే కొండపైకి వెళ్లాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే దీపం వెలిగించే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సుప్రీంకోర్టు అనుమతి, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్ నేపథ్యంలో కార్తీక మహాదీపం కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో మధురైలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. నవంబర్ 24న జరిగే కార్తీక మహాదీపం కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.