Kalvakuntla Kavitha: తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని ఆకాంక్షించారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తలెత్తడం విచారకరమని ఆమె అభిప్రాయపడ్డారు. కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ పరస్పర సహకారం, స్నేహభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు నెలకొనడం బాధాకరమని కవిత అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వైఖరి వల్ల రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, నీటి వివాదాలు, అక్రమాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని కవిత కోరారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని, అక్రమాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు TRS అధ్యక్షురాలు కవిత..

