Nepal Earthquake: నేపాల్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. తూర్పు నేపాల్‌లోని కోశి ప్రావిన్స్‌లో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదైంది. దీని ప్రభావం భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలపైనా పడింది. సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉంది.
నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7:17 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. తూర్పు నేపాల్‌లోని తప్లేజంగ్ జిల్లాలో, సిక్కిం సరిహద్దుకు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సిక్కింలోని గేజింగ్ ప్రాంతానికి సుమారు 68 కిలోమీటర్ల వాయువ్య దిశలో ఇది నమోదైంది. తూర్పు నేపాల్‌లోని పర్వత, మైదాన ప్రాంతాలతో పాటు భారత్‌లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ సమాచారం అందలేదు. అయితే బీహార్, మేఘాలయ, ఉత్తర బెంగాల్‌తో పాటు హిమాలయ ప్రాంతాలకు సమీపంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.

