Alliance Friction Andhra Pradesh Local Polls:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు  ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ, పదవుల పంపకాల విషయంలో మూడు పార్టీల మధ్య ఏర్పడిన అసంతృప్తి బహిరంగ విమర్శలకు, రాజీనామా బెదిరింపులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి కాకుండా టీడీపీకి  కేటాయించడంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడి కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డికి జడ్పీ చైర్మన్ పదవి దక్కకుండా అన్యాయం చేశారని ఆరోపిస్తూ, ఆయన ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడటం కూటమిలో కలకలం రేపింది.

ఆదినారాయణరెడ్డి రాజీనామా హెచ్చరిక                     

ఇప్పటికే జెడ్పీటీసీలుగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి సోదరుల కుమారులు తమ పదవులకు రాజీనామా చేయగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. స్థానిక ఎన్నికల్లోనే బీజేపీకి ఇలా సీట్లు, పదవులు నిరాకరిస్తే.. రేపు 2029 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని ఆదినారాయణ రెడ్డి బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేయడం కూటమిలోని అంతర్గత అపనమ్మకాన్ని బయటపెట్టింది. కూటమి ఎన్నికల్లో గెలిచినా, నైతికంగా ఓడిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ, ఇటు బీజేపీ అధిష్టానాలకు మింగుడుపడని అంశంగా మారాయి.

పంచాయతీ ఎన్నికల్లో జనసేన స్వేచ్ఛగా పోటీ

మరోవైపు, నవంబర్ 26, 29 ,  డిసెంబర్ 2 తేదీల్లో జరగనున్న 13,167 గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  తీసుకున్న నిర్ణయం కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు, సీట్ల పంపకాలు ఉండవని, జనసేన కార్యకర్తలు ఎక్కడైనా స్వేచ్ఛగా నామినేషన్లు వేసి పోటీ చేయవచ్చని, పోటీ చేసేవారిని ఎవరూ అడ్డుకోవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో టీడీపీ నేతల ఏకపక్ష వైఖరిపై జనసైనికుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికే పవన్ ఈ 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చారని భావిస్తున్నప్పటికీ, గ్రామాల్లో కూటమి పార్టీలే పరస్పరం తలపడితే అది కింది స్థాయి కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది.

కిందిస్థాయిలో క్యాడర్ మధ్య కుదరని సయోధ్య            

ఇప్పటికే నెల్లూరు వంటి జిల్లాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య స్థానిక  ఎన్నికల విషయంలో బహిరంగ విభేదాలు భగ్గుమంటున్నాయి. పైకి మూడు పార్టీల అగ్రనేతలు అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికార పంపిణీ, ప్రాధాన్యతల విషయంలో ఏర్పడుతున్న ఈ చిన్నచిన్న చిచ్చులే రానురాను పెద్దవిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో మొదలైన ఈ విభేదాలకు, అసంతృప్తులకు అగ్రనేతలు తక్షణమే సమన్వయంతో పరిష్కారం చూపకపోతే.. భవిష్యత్తులో ఇవి కూటమి పార్టీల మధ్య పూడ్చుకోలేని అగాధాలుగా మారి, ప్రతిపక్ష వైసీపీకి రాజకీయంగా పుంజుకునే అవకాశాన్ని ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.