Prithvi Shaw Warning: టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా తాజాగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం, గతాన్ని ప్రస్తావిస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేశాడు. అందులో యోగ్‌రాజ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే పృథ్వీ షా ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

స్పోర్ట్స్ లాంచ్‌ప్యాడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. పృథ్వీ షా కెరీర్ పతనానికి అతడి జీవనశైలే కారణమని వ్యాఖ్యానించాడు. గతంలో భారత మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ ఎదుర్కొన్న పరిస్థితులతో షాను పోల్చాడు. ‘పృథ్వీ షా కెరీర్ ఎందుకు దిగజారింది?. గతంలో వినోద్ కాంబ్లీ విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీలు, మహిళలతో సంబంధాలు, సిగరెట్లు, మద్యం ఇందుకు కారణం. కాంబ్లీకి ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అర్ధరాత్రి దాటిన తర్వాత గదికి వచ్చేవాడు. ఒకసారి అతడిని ఈ విషయంపై ప్రశ్నించాను. కానీ తన రోజులు అయిపోయాయని, తాము భిన్నమైన క్రికెట్ ఆడుతున్నామని సమాధానమిచ్చాడు. మరుసటి రోజు కోర్ట్నీ వాల్ష్ బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు. తర్వాత అతడితో ఉన్న అమ్మాయి కూడా వెళ్లిపోయింది. సిగరెట్లు, మద్యం ఇచ్చేవారు కూడా లేకుండా పోయారు. షా విషయంలోనూ ఇలాగే జరిగింది. చెడు స్నేహాలు, పార్టీలు, మద్యం వంటి అలవాట్లు ఉంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి’ అని యోగ్‌రాజ్ అన్నాడు.

యోగ్‌రాజ్ వ్యాఖ్యలపై స్పందించిన పృథ్వీ షా.. తన గతం గురించి దాచాల్సిందేమీ లేదని స్పష్టం చేశాడు. ‘నా గతం నా జీవితంలో ఒక భాగం. దాచడానికి లేదా సిగ్గుపడటానికి లేదు. అయితే నా పేరును, వ్యక్తిగత జీవితాన్ని, గతాన్ని ఉపయోగించుకుని నాపై దుష్ప్రచారం చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం, నా ప్రతిష్ఠను దెబ్బతీయడంను సహించను. ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇది చివరి హెచ్చరికగా భావించండి. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు లేదా ప్లాట్‌ఫామ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ అని షా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.