Ishan Kishan Emotional: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎమోషనల్ గా స్పందించాడు. ధోనీ నిర్ణయంతో అందరూ బాధపడ్డారని, భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నాడు. ఎంతోమంది యువ ఆటగాళ్లకు ధోనీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడాడు.

నవంబర్ 17, 2026న ఐపీఎల్ 2027 రిటెన్షన్ డే సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ధోనీ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించింది. ఇకపై ఆయన సీఎస్కే మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. దీనిపై ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించి ఉండవచ్చని తెలిపాడు. దేశానికి ఆయన ఎంతో సేవ చేశారని, ఎంతోమంది యువ ఆటగాళ్లను ప్రేరేపించారని పేర్కొన్నాడు. ఆయన సాధించిన విజయాలు, దేశం కోసం చేసిన సేవలు చాలా తక్కువ మంది మాత్రమే సాధించగలిగారని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు, ఇషాన్ కిషన్ తన ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ CEO కావ్య మారన్‌కు కూడా వివాహ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానని ఇషాన్ వెల్లడించాడు. వ్యక్తిగతంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని, కొత్త జంటకు అభినందనలు తెలియజేశానని చెప్పుకొచ్చాడు. ధోనీ చివరిసారిగా 2019లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో 2025 సీజన్‌లో చివరిసారిగా మైదానంలో కనిపించాడు. 2026లోనూ సీఎస్కే జట్టులో కొనసాగినప్పటికీ, గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. సీజన్ ప్రారంభానికి ముందే గాయపడిన ఆయన చివరి వరకు కోలుకోలేకపోయాడు.

44 ఏళ్లు దాటిన ధోనీ ఇకపై ఆటగాడిగా కాకుండా మెంటార్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కు సేవలు అందించనున్నాడు. దీంతో అభిమానులు ఆయనను మైదానంలో ఆటగాడిగా చూడలేకపోయినా, సీఎస్కే డగౌట్‌లో చూడవచ్చు. ఐపీఎల్ 2027 వేలంలోనూ ధోనీ సీఎస్కే యాక్షన్ టేబుల్‌పై కనిపించబోతున్నట్లు సమాచారం.