India A vs Pakistan: దోహాలో జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా జరిగిన 8వ మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 49.2 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు స్కోరులో మాజ్ సదాకత్ (59), హసన్ నవాజ్ (79), ఫర్హాన్ యూసుఫ్ (56) అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు.

అనంతరం 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 49.1 ఓవర్లలో 265 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ తిలక్ వర్మ (100) సెంచరీతో, అభిషేక్ శర్మ (70) హాఫ్ సెంచరీతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. దీంతో భారత్ 48 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ ఓటమికి కారణమైన ముగ్గురు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

1. రింకూ సింగ్: యువ బ్యాటర్ రింకూ సింగ్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో ప్రదర్శన నిరాశపరిచింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు అతడి నుంచి పెద్ద ఇన్నింగ్స్ అవసరమైన దశలో చౌకగా వికెట్ పారేసుకున్నాడు. 14 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి చెత్త షాట్ ఆడి అవుటయ్యాడు.

2. హర్షిత్ రాణా: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత పేసర్ హర్షిత్ రాణా జట్టుకు చాలా ఖరీదైన బౌలర్‌గా మారాడు. తన 10 ఓవర్ల స్పెల్‌లో 77 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. పాక్ బ్యాటర్లు అతడి చెత్త బౌలింగ్‌ను ఆసరాగా చేసుకుని విరివిగా పరుగులు రాబట్టారు. మొదట్లో అద్భుత బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా, ఆ తర్వాత లయ తప్పి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

3. వైభవ్ సూర్యవంశీ: యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మౌనంగా ఉంది. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడి 70 పరుగుల హాఫ్ సెంచరీ చేయగా, వైభవ్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. అతడి ఈ ఇన్నింగ్స్ భారత అభిమానులను, టీమ్ మేనేజ్మెంట్ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు టీమిండియా ఓటమికి అతడిని విలన్‌గా పరిగణిస్తున్నారు.

