Uttar Pradesh: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు పొరపాటున గౌరవ వందనం సమర్పించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు యంత్రాంగం సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంది. సదర్ సర్కిల్ ఆఫీసర్ (సీవో) పవన్ కుమార్‌ను ఆయన ప్రస్తుత బాధ్యతల నుంచి తొలగించి ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది. సహారన్‌పూర్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ మయాంక్ పాఠక్ ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కుమార్‌ను సదర్ సీవో పదవి నుంచి తొలగించి, సర్కిల్ ఆఫీసర్ (ట్రాఫిక్)గా నియమించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, సంఘటన జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఇతర పోలీసు అధికారుల పాత్రను కూడా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే?
అయితే, శనివారం సహారన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్ వద్ద ఒవైసీకి పొరపాటును గౌరవ వందనం చేశారు పోలీసులు.. వాస్తవానికి ఆ రోజు సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి సర్క్యూట్ హౌస్‌కు రావాల్సి ఉంది. ఆయనకు స్వాగతం పలికేందుకు పోలీసు అధికారులు గౌరవ వందనం సమర్పించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పోలీసు సిబ్బందిని కూడా అక్కడ మోహరించారు. కానీ, న్యాయమూర్తి రాకముందే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన భద్రతా సిబ్బందితో కలిసి సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆయన వెంట భద్రతా సిబ్బంది ఉండటంతో పోలీసులు అపార్థం చేసుకున్నారు. న్యాయమూర్తి వచ్చారని భావించి ఒవైసీకి గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల సెల్యూట్‌ను ఒవైసీ కూడా నిలబడి స్వీకరించారు. ఈ సమయంలో పోలీసులు ఆయనకు పూర్తి గౌరవంతో వందనం చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

సోషల్ మీడియాలో వైరల్.. విచారణ ప్రారంభం
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసు శాఖలో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, పోస్టులను తొలగించాలని కోరుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X)కు లేఖ రాసినట్లు గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణలో భాగంగా సదర్ సీవో పవన్ కుమార్‌పై బదిలీ వేటు పడింది. అయితే, ఘటన సమయంలో అక్కడ ఉన్న ఇతర పోలీసు సిబ్బంది బాధ్యతలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి విచారణ అనంతరం ఈ వ్యవహారంలో మరిన్ని చర్యలు ఉండే అవకాశముంది.