Telangana Congress Incharge BM Sandeep:  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా నియమితులైన బీఎం సందీప్  తన తొలి పర్యటనలోనే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మీనాక్షి నటరాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆయన, పొలిటికల్ అఫైర్స్ కమిటీ  సమావేశంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో విడివిడిగా ముఖాముఖీ భేటీ అయ్యారు. అయితే, ఈ తొలి సమావేశాల్లో ఆయన చేసిన ప్రసంగంలో పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించలేదని, గతంలో వచ్చిన ఇన్‌ఛార్జిలు చెప్పినట్లుగానే  అందరూ ఐక్యంగా పనిచేయాలి, విభేదాలు పక్కనపెట్టి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కృషి చేయాలి వంటి సాధారణ సుభాషితాలనే వల్లెవేశారని అభిప్రాయపడుతున్నారు.

గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలు

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఐక్యత కంటే కూడా.. అదుపు తప్పుతున్న  క్రమశిక్షణ. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బాహాటంగానే ప్రభుత్వ పనితీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు బహిరంగ వేదికలపైనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తుండటం ఢిల్లీ అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంతర్గత విభేదాలు నిత్యం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుండటంతో ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించినట్లవుతోంది.

రాజగోపాల్‌ను బుజ్జగించగలరా?                                 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం ఐక్యతా మంత్రం జపిస్తే సరిపోదని, బహిరంగ విమర్శలకు దిగే నేతలను కట్టడి చేయడానికి ఒక కఠినమైన, పక్కా ఫార్ములాను అమలు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.   ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు పంపి, ఇన్‌ఛార్జి సందీప్‌తో భేటీ కావాలని సూచించడం ఒక ప్రాథమిక అడుగుగా కనిపిస్తోంది. అయితే, ఇలాంటి భేటీలు కేవలం సర్దిచెప్పడానికే పరిమితమవుతాయా, లేక పార్టీ గీత దాటితే వేటు తప్పదన్న స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తారా అన్నది వేచి చూడాలి.

పార్టీకి , ప్రభుత్వానికి మధ్య సమన్వయం             

పార్టీకి , ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడం బీఎం సందీప్ ముందున్న అతిపెద్ద పరీక్ష.  నల్గొండ బ్రదర్స్ మధ్య విభేదాల నుంచి మంత్రుల మధ్య సమన్వయ లోపం వరకు అనేక సున్నితమైన అంశాలను ఆయన చక్కదిద్దాల్సి ఉంది. గత ఇన్‌ఛార్జిల మాదిరిగానే కేవలం రివ్యూ మీటింగ్‌లు, నివేదికల సేకరణకే పరిమితమైతే.. తెలంగాణ కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలను నియంత్రించలేక కొత్త ఇన్‌ఛార్జి కూడా చేతులెత్తేసినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఢిల్లీ అధిష్టానం అండతో బీఎం సందీప్ కఠిన చర్యలకు ఉపక్రమించి పార్టీని గాడిలో పెడతారా లేక పాత కథే పునరావృతమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.