హైదరాబాద్, నవంబర్ 7: సివిల్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్-2026 మెయిన్ పరీక్షల ఫలితాలను నవంబర్ 5న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,526 మందిని తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష నుంచి మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 751 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలో పరీక్షలు రాసిన తెలుగు అభ్యర్థులను కలిపి దాదాపు వెయ్యి మంది వరకు మెయిన్స్‌కు అర్హత సాధించి ఉండవచ్చని అంచనా.
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలను ఆగస్టు 21 నుంచి 30 వరకు నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను నవంబర్ 5న వెల్లడించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు ఇంటర్వ్యూ దశకు సిద్ధం కావాల్సి ఉంటుంది. మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 2,526 మంది అభ్యర్థులను వ్యక్తిత్వ పరీక్ష (Personality Test) లేదా ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. డిసెంబర్ నెలలో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ తేదీలు, షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ ప్రత్యేకంగా వెల్లడించనుంది.
సివిల్ సర్వీసెస్-2026 నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1,016 పోస్టులను భర్తీ చేయాలని యూపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ (IFS) తదితర కేంద్ర ప్రభుత్వ ఉన్నత సర్వీసుల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మెయిన్స్ ఫలితాలు విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ నుంచి 751 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలో పరీక్షలు రాసిన తెలుగు విద్యార్థులను కలిపి దాదాపు వెయ్యి మంది వరకు ఉండొచ్చని అంచనా. వీరిలో 100 నుంచి 125 మంది వరకు ఇంటర్వ్యూకు ఎంపికై ఉండవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు తుది ర్యాంకులు కేటాయించి, అందుబాటులో ఉన్న ఖాళీలు, మెరిట్, ప్రాధాన్యతల ఆధారంగా సర్వీసులు కేటాయించనున్నారు. సివిల్స్ అభ్యర్థులు తమ మెయిన్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు.

