Pamphlets Along With Ballots: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల భవితవ్యం నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుండి అన్నిచోట్లా స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో అధికారపార్టీ హవా కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల నువ్వా.. నేనా.. అనేలా పోటీ నెలకొంది. అయితే వీటన్నిటి మధ్య పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతోపాటు గ్రామ సమస్యకు సంబంధించిన పాంప్లెట్లను కూడా వేశారు. తమ గ్రామంలో రైల్వే నిర్మిస్తున్న అండర్‌పాస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పాంప్లెట్ల ద్వారా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ బాక్సుల్లో పాంప్లెట్లు ఎక్కువగా ఉండటంతో కంకణాలపల్లి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది.

ఓటర్లు వేసిన పాంప్లెట్లలో తమ గ్రామానికి నేరుగా ఉన్న రహదారిలోనే రైల్వే అండర్‌పాస్ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. కొత్తగా U ఆకారంలో నిర్మాణం చేపడితే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లేందుకు పాంప్లెట్లను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. తమ గ్రామ రహదారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చూడాలి మరి ఈ విషయమై అధికారులు, నాయకులూ ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో..