Revanth Reddy Government Litmus Test MLC: తెలంగాణలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లిట్మస్ టెస్ట్ గా మారాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న పాలనా నిర్ణయాలు, హామీల అమలుపై విద్యావంతులైన ఓటర్లు ఏ తరహా ముద్ర వేయబోతున్నారనేది ఈ ఎన్నికల ద్వారా తేలనుంది. ఓ రకంగా చెప్పాలంటే, ఈ పట్టభద్రుల పోరు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఒక అప్రకటిత రిఫరెండం లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్ని వర్గాల గ్రాడ్యూయేట్లు ఓట్లు వేసే ఎన్నిక
పట్టభద్రుల నియోజకవర్గం అనేది ఒక నిర్దిష్ట సమూహానికో లేదా ప్రాంతానికో పరిమితమైంది కాదు. ఇందులో నిరుద్యోగ యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఐటీ నిపుణులు, మేధావులు , గ్రామీణ-పట్టణ ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల విద్యావంతులైన ఓటర్లు భాగస్వాములుగా ఉంటారు. ఈ తరగతి ఓటర్లు పొలిటికల్ గా ఎంతో చైతన్యవంతంగా ఆలోచిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధి, ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల , జీతాల చెల్లింపుల వంటి అంశాలను నిశితంగా గమనించి తమ తీర్పును బ్యాలెట్ ద్వారా వినియోగిస్తారు.
కాంగ్రెస్ గెలిస్తే పాజిటివ్ వేవ్
ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే.. ప్రభుత్వంపై ప్రజల్లో, ముఖ్యంగా యువత , విద్యావంతుల్లో బలమైన పాజిటివ్ వేవ్ ఉందనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం నొక్కి చెప్పగలదు. ఇది వచ్చే స్థానిక సంస్థల పోరుకు, ఇతర సాధారణ ఎన్నికలకు పార్టీకి మైలేజ్ ఇస్తుంది. కానీ, ఒక్క స్థానంలో ఫలితం తేడా వచ్చినా లేదా స్వల్ప తేడాతో ఓటమి పాలైనా.. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు పెద్ద ఆయుధం దొరికినట్లవుతుంది. కాంగ్రెస్ సర్కార్‌పై అప్పుడే తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది అంటూ గళమెత్తేందుకు విపక్షాల ప్రచారానికి ఇది ఆజ్యం పోసినట్లవుతుంది.
ఓడితే నెగెటివ్ ప్రచారం
ఇప్పటికే నిరుద్యోగుల ఆందోళనలు, ఉద్యోగ ప్రకటనల్లో జాప్యం, రైతు భరోసా , పెన్షన్ల పంపిణీపై విపక్షాలు నిరంతరం దాడి చేస్తున్న వేళ.. పట్టభద్రుల ఓటింగ్ నెగెటివ్‌గా పడితే ఆ ప్రచారం మరింత జోరందుకుంటుంది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్‌కి తీవ్ర రాజకీయ ముప్పుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవడం పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ప్రతి ఒక్క ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పకడ్బందీ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్ నాయకత్వం, సమర్థులైన అభ్యర్థులను ఖరారు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది. కానీ, కేవలం క్యాంపెయిన్ మాత్రమే సరిపోదని.. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న చిన్నపాటి అసంతృప్తిని ముందే గుర్తించి, వారితో నేరుగా చర్చలు జరిపి నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత మంత్రివర్గంపై ఉంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్-రంగాజిల్లా-మహాబూబ్‌నగర్ , ఉమ్మడి జిల్లాల స్థానాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా నష్టం ఊహించని రీతిలో ఉంటుంది.
ఈ పట్టభద్రుల సమరం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక శాసనమండలి సీటు గెలుపు మాత్రమే కాదు, తన ప్రభుత్వ రాజకీయ విశ్వసనీయతను నిరూపించుకునే పరీక్ష. అప్రమత్తంగా వ్యవహరించి అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటేనే కాంగ్రెస్ ఈ రిఫరెండం పోరులో గట్టెక్కగలదు, లేనిపక్షంలో విపక్షాల దాడికి ఎదురు నిలవడం రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్‌కి కత్తిమీద సాముగా మారనుంది.

