హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శనివారం మధ్యాహ్నం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటకు చేరుకుంటారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ రూ. 9,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో రైతులు, పారిశ్రామికవేత్తలు మరియు స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, అక్కడి ప్రత్యేక స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశమై సాగు పద్ధతులు, వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించనున్నారు.
నేటి సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ప్రాంతీయ పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. దాని తర్వాత సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.

