బ్రెజిల్‌లోని సావో లూయిస్‌లో ఉన్న రియో పోటీ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. 26 ఏళ్ల రెనాటా తన ప్రియుడితో కలిసి అక్టోబర్ 28న అక్కడికి వెళ్లింది. పోకర్ ఆట ఆడేందుకు వీరిద్దరూ సావో లూయిస్‌కు వచ్చినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో రెనాటా హోటల్ ఏడో అంతస్తులోని కారిడార్ కిటికీ దగ్గర కూర్చుంది. ఆ తర్వాత కిటికీకి అమర్చిన అల్యూమినియం ఫ్రేమ్‌కు ఆనుకుంది. అంతలోనే ఊహించని విధంగా ఆ ఫ్రేమ్ విరగడంతో అదుపుతప్పి ఏడో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. హోటల్ ప్రవేశ ద్వారం షెడ్‌పై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది.
సీసీటీవీలో రికార్డైన చివరి క్షణాలు
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కిటికీ అంచున కూర్చున్న రెనాటా.. ఆ తర్వాత ఫ్రేమ్‌కు ఆనుకోవడం.. అది ఒక్కసారిగా విరిగి కిందపడటం వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో ఆమె ప్రియుడు కూడా అక్కడే ఉన్నాడు. రెనాటా కిందపడిపోయిన వెంటనే అతను కొన్ని క్షణాల పాటు కదలకుండా అలాగే నిలబడిపోయాడు. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి.
‘ఆమెను తోసేయలేదు’ పోలీసుల వ్యాఖ్యలు
ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెనాటాను ఆమె ప్రియుడు కిందకు తోసేశాడా? అనే కోణంలోనూ విచారణ జరిపారు. దర్యాప్తు అధికారి జార్జ్ మార్క్వెస్ ఈ అనుమానాలపై స్పందించారు. ‘ఆమెను అతడు తోసేయలేదు ఆమెకు దగ్గరగా కూడా లేడు’ అని డైలీ మెయిల్ కథనం ప్రకారం స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో వారిద్దరూ మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రియుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం విడుదల చేశారు. మరోవైపు హోటల్ సిబ్బందిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కిటికీ ఫ్రేమ్ ఎందుకు విరిగిపోయింది? దాని నిర్వహణలో ఏమైనా లోపాలున్నాయా? అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Tragedy in Brazil: 26-year-old woman falls to her death from the seventh floor of a hotel after simply leaning against a window
The incident occurred on November 3 at the Rio Poty Hotel in São Luís. Renata Rebeca Saldanha dos Santos leaned against a window. The structure gave way, and she fell from the seventh floor.
Her boyfriend was questioned by police over suspicions of involvement in her death, but surveillance footage showed that he neither pushed nor assaulted her. He was released.
Police are treating the incident as an accident. The cause of the window’s structural failure is still under investigation.
— NEXTA (@nexta_tv) November 5, 2026
ఇద్దరు పిల్లల తల్లి.. ఇంటికి వస్తుందనుకుంటే శవపేటికలో..
రెనాటాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. ఆమె స్వస్థలం బ్రెజిల్‌లోని పారాలోని ఓ ప్రాంతం. ప్రియుడితో సావో లూయిస్‌కు వెళ్లిన ఆమె మంగళవారం తిరిగి ఇంటికి చేరుకోవాల్సి ఉంది. ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
కుమార్తె మరణంతో ఆమె తల్లి బెట్టీ నెగ్రావో తట్టుకోలేకపోయారు. స్థానిక టీవీ ఛానల్ లిబరల్ తో ఆవేదనను వెళ్లగక్కారు. ‘నా కూతురు సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లింది. కానీ ఇప్పుడు ఆమెను శవపేటికలో చూడాల్సి వస్తోంది,’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్క క్షణంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. ప్రమాదానికి అసలు కారణం తెలుసుకునేందుకు బ్రెజిల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి


Tragedy in Brazil: 26-year-old woman falls to her death from the seventh floor of a hotel after simply leaning against a window