ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా (Canva) పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం ఉద్యోగుల్లో 22 శాతం మంది అంటే 1,271 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. కాన్వా ప్రారంభమైన 13 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత కఠినమైన సమయమని సంస్థ సీఈఓ మెలానీ పెర్కిన్స్ తెలిపారు. ఉద్యోగులపై ఈ నిర్ణయం చూపించే ప్రభావం తమకు తెలుసునని, ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు. అయితే వారు ఇబ్బందుల్లో పడకుండా వీలైనంత ఎక్కువ సహాయం అందించాలని కంపెనీ నిర్ణయించింది.
ఆరు నెలల జీతం.. మ్యాక్‌బుక్ మీదే!
సాధారణంగా ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు కంపెనీలు నోటీసు పీరియడ్, పరిహారం వంటి ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. కానీ కాన్వా మాత్రం అంతకుమించి ప్రయోజనాలను ప్రకటించింది. ఉద్యోగం కోల్పోయిన వారు కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా పలు సదుపాయాలు కల్పిస్తోంది. ఉద్యోగం కోల్పోయిన వారికి ఆరు నెలల వేతనం, అర్హత ఉన్న దేశాల్లో 12 నెలల హెల్త్ కవరేజ్, మ్యాక్‌బుక్ లేదా ల్యాప్‌టాప్‌ను ఉంచుకునే సదుపాయం, కెరీర్ కోచింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఉద్యోగ అన్వేషణలో మార్గదర్శకత్వం, ఏడాది పాటు ఉచిత లింక్డ్ఇన్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వంటివి అందిస్తోంది.
సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? రూ.8.8 లక్షల సాయం!
కాన్వా ప్రకటించిన ప్రయోజనాల్లో మరో ఆసక్తికర అంశం సొంతంగా వ్యాపారం ప్రారంభించే వారికి కంపెనీ అండగా నిలవడం. Canva Collective Fund ద్వారా 10,000 అమెరికన్ డాలర్ల గ్రాంట్ అందించనుంది. ఇది భారత కరెన్సీలో రూ 8.8 లక్షలు. ఈ మొత్తాన్ని అందించినందుకు ప్రతిఫలంగా వారి వ్యాపారంలో కంపెనీ ఎలాంటి వాటా (ఈక్విటీ) తీసుకోదు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇది మంచి అవకాశం.
తొలగింపు సాయం పై ప్రశంసలు.. సోషల్ మీడియాలో చర్చ!
కాన్వా నిర్ణయం సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఉద్యోగులకు అందిస్తున్న ప్రయోజనాలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. లింక్డ్ఇన్ యూజర్ అక్షయ్ సైనీ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు బాధాకర విషయమని కంపెనీ ఎలా వ్యవహరిస్తుందనేది నాయకత్వ లక్షణాలను తెలియచేస్తుందని అన్నారు. ఆరు నెలల జీతం, ల్యాప్‌టాప్, హెల్త్ కవరేజ్, కెరీర్ సపోర్ట్ ఉద్యోగులకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. అయితే ఉద్యోగం కోల్పోవడం వల్ల కలిగే భయాన్ని తక్కువగా చూడలేమని గుర్తుచేశారు.
మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లోనూ కోతలు
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు, పునర్వ్యవస్థీకరణలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాలను ప్రకటించాయి. ఫ్రాన్స్‌లోని ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అవకాశాలను అందించింది మెటా. గూగుల్ ఐదు దేశాల్లో ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. ఇక మైక్రోసాఫ్ట్ అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్‌లో అర్హులైన 60 వేల మంది ఉద్యోగుల కోసం బైఅవుట్ కార్యక్రమాన్ని ప్రకటించింది.
ఒకవైపు టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు ఉద్యోగులను తొలగించే సమయంలో వారికి ఎలాంటి భరోసా కల్పించాలనే అంశంపై కాన్వా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఉద్యోగాల కోత తప్పనిసరి అయినా ఉద్యోగుల భవిష్యత్తు గురించి కంపెనీలు ఎంత బాధ్యతగా వ్యవహరించవచ్చో ఈ ఉదంతం మరోసారి చర్చకు తెరతీసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి

