YS Jagan MPTC ZPTC Elections Remarks 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మధ్యలో ఉన్న సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ క్షేత్రస్థాయి శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి, అసంతృప్తికి దారితీశాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలుగా గుర్తించేందుకు జగన్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఇవి ఎలక్షన్లు కావు.. అధికార కూటమి చేసుకుంటున్న సెలక్షన్లు అంటూ ఆయన తేలికగా కొట్టిపారేయడంపై, తెగించి క్షేత్రస్థాయిలో పోరాడుతున్న పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నిరాశకు గురవుతున్న ద్వితీయ శ్రేణి నేతలు
అధినేత నుంచి సరైన రాజకీయ మద్దతు, ప్రచార వ్యూహాలు లేకపోయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక అభ్యర్థులు మాత్రం గ్రౌండ్‌లో తమ పట్టు జారిపోకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సొంత బలంతో పోటీకి దిగి, ఎన్డీయే కూటమి అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు క్షేత్రస్థాయి కార్యకర్తలు కష్టపడుతున్నారు. అయితే, తాము ఇంతలా కష్టపడుతుంటే.. పార్టీ అధినేతే స్వయంగా ఇవి అసలు ఎన్నికలే కావని, కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలతో గెలుచుకుంటోందని ప్రకటనలు గుప్పించడం వల్ల పోలింగ్ బూత్‌ల వద్ద పనిచేసే కేడర్ తీవ్రంగా డీలా పడిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాయ్ కాట్ చేసి ఉంటే బాగుండేదన్న భావన
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థుల అంతరంగంలో ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మెదులుతోంది. ఈ ఎన్నికలను జగన్ అంత తేలికగా తీసుకునే ఉద్దేశమే ఉంటే, అసలు మొదటికే ఈ పోరును పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి ఉంటే సరిపోయేది కదా అన్న వాదన వినిపిస్తోంది. బహిష్కరణ నిర్ణయం తీసుకుని ఉంటే, లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ప్రచారం కోసం, పోలింగ్ నిర్వహణ కోసం ఖర్చు చేసిన స్థానిక వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తీవ్ర ఆర్థిక నష్టాల నుంచి అయినా బయటపడేవారు. సగం మందికి పోరు బాట చూపి, సగం ఆటలో అధినేతే ఇవి ఎన్నికలే కావు అని వ్యాఖ్యానించడం వల్ల అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా కేడర్ నష్టపోతోందని అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలన్నీ ముగిశాక స్పందిస్తే బాగుండేదన్న వాదన
యుద్ధం ముగిశాక, ఫలితాలు వెలువడ్డాక అధికార యంత్రాంగం దుర్వినియోగం అయిందని లేదా అక్రమాలు జరిగాయని మాట్లాడితే ఒక అర్థం ఉండేదని.. పోలింగ్ ప్రక్రియ సాగుతున్న సమరంలోనే ఇలాంటి నిరాశాపూర్వక వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. అధినేత వ్యాఖ్యలు ప్రత్యర్థి కూటమి శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుండగా, తమ సొంత పార్టీ ఓటర్లలో ఎలాగూ మన నాయకుడే పట్టించుకోవడం లేదు కదా అనే ఉదాసీనతను నింపుతోందని స్థానిక అభ్యర్థులు వాపోతున్నారు.
2024 అసెంబ్లీ ఓటమి తర్వాత నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఈవీఎంల విశ్వసనీయతను, మున్సిపల్ ఫలితాలను, ఇప్పుడు పరిషత్ ఎన్నికల పారదర్శకతను ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే కేవలం విమర్శలకే పరిమితమై, ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలబడి పోరాడే ప్రణాళికను పార్టీ ఇవ్వలేకపోతోందనే విమర్శలు వైఎస్సార్‌సీపీ అంతర్గత వర్గాల నుంచే వస్తున్నాయి. చంద్రగిరి, పల్నాడు, అనంతపురం వంటి ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఒంటరిగా పోరాడుతుంటే, తాడేపల్లి ప్రెస్ మీట్లతో సరిపెట్టడం నాయకత్వ బలహీనతను చూపుతోందని భావిస్తున్నారు.
ఏదైనా రాజకీయ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలే ప్రాణవాయువు లాంటివి. భవిష్యత్తు అసెంబ్లీ సమరానికి స్థానిక కేడరే పునాది. అలాంటి కేడర్‌ను ఆదుకోవాల్సింది పోయి, వారి పోరాట పటిమను దెబ్బతీసేలా అధినేత మాట్లాడటం వైఎస్సార్‌సీపీకి సుదీర్ఘకాలంలో కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి స్థానిక నాయకత్వానికి భరోసానిచ్చి, ఎన్నికల ఫలితాల అనంతరం శ్రేణులకు అండగా నిలిచే స్పష్టమైన రాజకీయాన్ని ప్రదర్శించకపోతే గ్రామీణ ఏపీలో వైఎస్సార్‌సీపీ తన మిగిలిన పట్టును కూడా వేగంగా కోల్పోక తప్పదన్న ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతంది.

