Raptadu Student Gopika Health Recovery: అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన దారుణ దాడి    నివ్వెరపరిచింది. అయితే, ఆ  ఆపద సమయంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ స్పందించిన తీరు, తీసుకున్న సత్వర నిర్ణయాలు ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యతాయుత ప్రవర్తనకు అద్దం పడుతున్నాయి. రాజకీయాన్ని , ప్రచారాన్ని పక్కనబెట్టి, ఓ కుటుంబసభ్యుడి లాగా బాధితురాలి ప్రాణాలు కాపాడటమే ఏకైక లక్ష్యంగా ఆయన చూపిన అంకితభావం పట్ల సామాన్య ప్రజల నుంచి  విశేష ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

గ్రీన్ చానల్ ద్వారా బెంగళూరు తరలింపు

దాడి జరిగిన నిమిషం నుంచే లోకేశ్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు.  రక్తస్రావమై చావుబతుకుల మధ్య ఉన్న చిన్నారికి స్థానిక చికిత్స సరిపోదని గ్రహించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యేక  గ్రీన్ ఛానల్  ద్వారా బెంగళూరులోని కార్పొరేట్ దిగ్గజ ఆస్పత్రి మణిపాల్‌కి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా సరిహద్దు దాటించి, మణిపాల్ ఆస్పత్రిలోని మల్టీడిసిప్లినరీ స్పెషలిస్ట్ వైద్యుల బృందాన్ని సిద్ధం చేయడంలో లోకేశ్ వహించిన క్రియాశీలక పాత్ర చిన్నారి ప్రాణాలను నిలబెట్టడంలో కీలక మైలురాయిగా నిలిచింది.

నిరంతర వైద్య పర్యవేక్షణ 

కేవలం తరలింపుతో తన బాధ్యత ముగిసిపోయిందని భావించకుండా.. స్వయంగా బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి లోకేశ్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వద్దకు వెళ్లి పాప ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. గంటల తరబడి సాగిన సంక్లిష్టమైన ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించి నిపుణులైన వైద్యులతో ముఖాముఖి మాట్లాడి, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందేలా చూశారు. ఆస్పత్రి బెడ్‌పై అచేతనంగా ఉన్న పాపను చూసి కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులకు గోపిక బాధ్యత నాది, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది  అని భరోసానివ్వడం ఆయనలోని మానవత్వాన్ని చాటిచెప్పింది.  ఆపై ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొన్న వేళ.. గోపిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ అప్‌డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా నిరంతరం పారదర్శకంగా ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు. ఆపరేషన్ సక్సెస్ కావడం, వెంటిలేటర్ సపోర్ట్ తొలగించడం, స్వయంగా శ్వాస తీసుకోవడం నుండి తాజాగా పాప కుడి భుజానికి ప్లేట్ ఫిక్సేషన్ సర్జరీ పూర్తయి, మంచం దిగి సొంతంగా అడుగులు వేయడానికి ఉత్సాహం చూపే వరకు రోజువారీ పురోగతిని పంచుకున్నారు. ఒక నిమిషం క్రితం వరకు చావు ముంగిట నిలిచిన బాలిక, కొద్ది రోజుల్లోనే నడిచే స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్య బృందానికి, ప్రభుత్వ సహాయానికి ప్రజలు అభినందనలు చెబుతున్నారు. 

ర్యాపిడ్ యాక్షన్‌తో నిలిచిన ప్రాణం .

ఈ ఘటన ద్వారా ప్రజా సంక్షేమం,  విపత్తు నిర్వహణలో సత్వర స్పందన ఎంతటి అద్భుతాలను సృష్టిస్తుందో లోకేశ్ రుజువు చేశారు. పాలకులు కేవలం చట్టాలు చేయడం లేదా ప్రకటనలు గుప్పించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో సమస్య ఎదురైనప్పుడు స్వయంగా బాధ్యత తీసుకుని నిలబడితే ప్రాణాలు ఎలా నిలబడతాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఓ సామాన్య బాలిక పునర్జన్మ వెనుక నిలిచిన నారా లోకేశ్ ప్రదర్శించిన ఈ చిత్తశుద్ధి, రాజకీయాభిప్రాయాలకు అతీతంగా ప్రజా క్షేత్రంలో ఆయన ఇమేజ్‌ను మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్లింది.