టూత్ బ్రష్‌తో పళ్లు తోముకుంటూ ఎవరైనా దాన్ని మింగేస్తారా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ! కానీ మహారాష్ట్రలో నిజంగానే ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి పొరపాటున ఏకంగా 19 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్‌ను మింగేశాడు. అది కడుపులోకి వెళ్లి అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో వైద్యులు కూడా ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే దాన్ని బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మహారాష్ట్రలోని పెన్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర మాలుసారే అనే 50 ఏళ్ల వ్యక్తి ఆటో రిక్షా నడుపుతూ జీవిస్తున్నాడు. ఆయనకు శారీరక వైకల్యం కూడా ఉంది. ఒకరోజు ఉదయం మిగతా రోజుల్లాగే పళ్లు తోముకోవడానికి బ్రష్ తీసుకున్నాడు.

అయితే అనుకోకుండా చేతిలో ఉన్న బ్రష్ మొత్తం జారి గొంతులోకి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా దాన్ని బయటకు తీయలేకపోయాడు. చివరకు బ్రష్‌ను పూర్తిగా మింగేశాడు. దీంతో కంగారుపడిన రాజేంద్ర మొదట స్థానిక వైద్యుడిని సంప్రదించాడు. వైద్యుడు ఎక్స్‌రే తీయించుకోవాలని సూచించాడు. అయితే ఎక్స్‌రేలో బ్రష్ కనిపించలేదు. గతంలోనూ ఆయనకు ఇలాంటి వస్తువులను పొరపాటున మింగిన అనుభవం ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నవీ ముంబైలోని మెడికవర్ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటన జరిగిన 4గంటల తర్వాత రాజేంద్ర ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే ఆయనకు కొద్దిగా కడుపునొప్పి మొదలైంది.

వైద్యులు ఎండోస్కోపీ పరీక్ష చేశారు. అంటే ఒక చిన్న కెమెరా ఉన్న ప్రత్యేకమైన పరికరాన్ని నోటి ద్వారా లోపలికి పంపించి జీర్ణవ్యవస్థలో ఏం జరుగుతుందో పరిశీలించారు. అప్పుడు వైద్యులకు 19 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్ కడుపులో అడ్డంగా పడుకుని కనిపించింది. సాధారణంగా చిన్న వస్తువులను పొరపాటున మింగినప్పుడు అవి జీర్ణవ్యవస్థలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

అయితే టూత్ బ్రష్ గట్టిగా ఉంటుంది. వంగదు. పైగా పొడవుగా ఉంటుంది. మన గొంతు నుంచి కడుపు వరకు వెళ్లే ఆహార నాళంలో ఎన్నో వంపులు, ఇరుకైన మార్గాలు ఉంటాయి. అలాంటి మార్గాల్లో ఈ బ్రష్ ఇరుక్కుపోతే పేగుల్లో అడ్డంకి ఏర్పడవచ్చు. చివరకు లోపలి భాగాలకు చిల్లులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వైద్యులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బ్రష్‌ను బయటకు తీయాలని నిర్ణయించారు. అయితే దీనికోసం కడుపును కోసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారానే ప్రయత్నించారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఎండోస్కోపీ డివైజ్ చివర ప్రత్యేకమైన హుడ్‌ను అమర్చి దాని సాయంతో బ్రష్ ఒక చివరను గట్టిగా పట్టుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా బయటకు లాగడం ప్రారంభించారు.

కడుపు నుంచి బ్రష్ బయటకు వస్తున్న సమయంలో కడుపు, ఆహార నాళం కలిసే ప్రాంతంలో అది ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి ముందుకు తీసుకురావడం వైద్యులకు కష్టంగా మారింది. బ్రష్ గట్టిగా ఉండటంతో ఆహార నాళంలోని సహజమైన వంపులకు అనుగుణంగా దాన్ని తిప్పడం సాధ్యం కాలేదు. దీంతో వైద్యులు తమ ప్రయత్నాలను మార్చారు. రోగి పడుకున్న విధానాన్ని కూడా మార్చి, బ్రష్‌ను సరైన కోణంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.

అలా కొంత ముందుకు తీసుకొచ్చిన తర్వాత మరో సమస్య ఎదురైంది. గొంతు దగ్గర ఉన్న మరి ఇరుకైన ప్రాంతంలో బ్రష్ మళ్లీ ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి బయటకు తీయాలంటే మరింత జాగ్రత్త అవసరం. కొంచెం పొరపాటు జరిగినా గొంతులోని సున్నితమైన భాగాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అయినప్పటికీ వైద్యులు ఓపికగా బ్రష్ స్థానాన్ని మార్చుతూ ప్రయత్నించారు. చివరకు వారి ప్రయత్నాలు ఫలించాయి. ఎలాంటి ముక్కలు కాకుండా మొత్తం టూత్ బ్రష్‌ను అలాగే నోటి ద్వారా బయటకు తీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికోసం ఎలాంటి సర్జరీ చేయలేదు. బ్రష్ బయటకు వచ్చిన తర్వాత వైద్యులు మరోసారి ఎండోస్కోపీ చేశారు. లోపల ఎక్కడైనా గాయాలయ్యాయా? గొంతు నుంచి కడుపు వరకు ఉన్న కండరాల భాగాలకు ఏమైనా నష్టం జరిగిందా? అని పరిశీలించారు. అయితే పైభాగంలోనూ, కిందిభాగంలోనూ ఎలాంటి గాయాలు కనిపించలేదు. చికిత్స తర్వాత రాజేంద్రకు ఉన్న కడుపునొప్పి కూడా తగ్గిపోయింది.

ఇక ఈ ఘటన నుంచి మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. పొరపాటున టూత్ బ్రష్ లాంటి పెద్ద వస్తువులను మింగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దాన్ని బయటకు తీసుకోవడానికి వాంతులు చేసుకునే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఆ వస్తువును ఆహారంతో కిందకు నెట్టేయాలని కూడా ప్రయత్నించకూడదు. అలా చేస్తే గొంతు, ఆహార నాళంలో గాయాలు కావచ్చు. రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. పైగా ఆ వస్తువు మరింత గట్టిగా ఇరుక్కుపోవచ్చు. మొత్తానికి పళ్లు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే ఒక చిన్న బ్రష్ ఎంత పెద్ద సమస్యను తీసుకొచ్చిందో చూశారు కదా! అయితే డాక్టర్ల కృషితో రాజేంద్రకు ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండానే ప్రాణాపాయం తప్పింది.