Hyderabad Water Tanker Strike HYDRA Action: కోటి జనాభా దాటిన హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరా సవాలుగా మారింది. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అగాధానికి పడిపోవడంతో నగరవాసులు ఇప్పటికే నీటి చుక్క కోసం తీవ్ర అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ జలమండలి పైపులైన్ల ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నిరంతరాయంగా నీటిని అందించడంలో తీవ్ర నిస్సహాయత ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో వేలాది బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, ఐటీ కారిడార్‌లోని విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, చివరకు శివారు కాలనీల దాహార్తిని తీరుస్తున్నది ప్రైవేటు బోర్ల ఆధారంగా నడిచే నీటి ట్యాంకర్లే. అయితే, ముందస్తు ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా హైడ్రా ఏకపక్షంగా రంగంలోకి దిగి అక్రమ బోర్ల పేరిట విరుచుకుపడటంతో మహానగరం ఒక్కసారిగా నీటి గందరగోళంలోకి జారుకుంది.
ఏళ్లతరబడి నడుస్తున్న బోర్లపై సడెన్ ఎటాక్
సున్నం చెరువు, తమ్మిడికుంట, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో సరస్సుల సమీపంలో , ప్రభుత్వ స్థలాలలో వ్యాపార రీత్యా నడుస్తున్న వాటర్ పాయింట్లు, అక్రమ బోర్లపై హైడ్రా దాడులు చేసి, కనెక్షన్లు కట్ చేయడం, మోటార్లు, సంపులను ధ్వంసం చేయడంతో ట్యాంకర్ల వ్యవస్థ దెబ్బతిన్నది. అక్రమంగా భూగర్భ జలాలను తోడేస్తున్నారని, వాటర్ ట్యాంకర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాయన్న నెపంతో హైడ్రా తీసుకున్న ఈ ఉన్నపళంగా కఠిన చర్యలు సత్ఫలితాల కంటే నగరవాసులకు నరకాన్ని చూపించాయి. అక్రమ జల దందాను అరికట్టడం మంచిదే అయినప్పటికీ, ప్రజలకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను సుగమం చేయకుండా మూలాధారమైన కనెక్షన్లు తెంచివేయడం ప్రైవేటు ట్యాంకర్ల వ్యవస్థను స్తంభింపజేసింది. ఫలితంగా మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంగణాలతో పాటు చుట్టుపక్కల విస్తరించిన మియాపూర్, కూకట్పల్లి, మణికొండ శివారు ప్రాంతాలలో తీవ్రమైన జల సంక్షోభం తలెత్తింది. ఆర్డర్ పెడితే మూడు రోజులైనా ట్యాంకర్ రాని పరిస్థితి ఏర్పడగా, లభ్యత తక్కువ కావడంతో ప్రైవేటు వ్యాపారులు ఒక్కో ట్యాంకర్‌కు రెట్టింపు ధరలు వసూలు చేస్తూ బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారు. రోజువారీ అవసరాలకు నీరు దొరక్క అపార్ట్మెంట్లలోని ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్లెక్కి నిరసన తెలిపే దైన్య స్థితికి చేరుకున్నారు. ట్యాంకర్ల యజమానులు సమ్మె బాట పట్టడంతో గందరగోళం మరింత పెరిగింది.
ఔటర్ వెలుపుల నుంచి ట్యాంకర్లతో నీరు
పరిస్థితి చేయిదాటి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి ట్యాంకర్ల అసోసియేషన్‌తో అత్యవసర చర్చలు జరపాల్సి వచ్చింది. అక్రమ బోర్ల తొలగింపు పేరుతో ప్రజల తాగునీటి సరఫరాకు విఘాతం కలగకుండా, ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకునేలా తాత్కాలిక సడలింపులు ఇవ్వడంతో ఎట్టకేలకు ట్యాంకర్లు మళ్లీ రోడ్లక్కాయి. అయితే, రెండు రోజుల పాటు సాగిన ఈ హైడ్రా హడావుడి సృష్టించిన గందరగోళం మాత్రం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందనడంలో సందేహం లేదు. సంక్షోభ సమయాల్లో చట్టాలను, నిబంధనలను బుల్డోజర్ల ధోరణితో కఠినంగా అమలు చేయడం కంటే పౌరుల ప్రాథమిక అవసరాలైన నీటి సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యం. ఏజెన్సీలు అక్రమాలను అరికట్టే సమయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను, సాధారణ పౌరుల అవసరాలను పరిగణనలోకి తీసుకోకపోతే.. ప్రజలు ఆ నిబంధనలను పక్కనబెట్టి తమ దాహార్తిని తీర్చడంలో విఫలమైన ప్రభుత్వాన్నే నిందిస్తారు. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల కాపాడుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ జల వనరులను పెంచే పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తేనే హైదరాబాద్ లాంటి విశ్వనగరం దాహంతో అల్లాడిపోకుండా నిలబడుతుంది.

