MPTC ZPTC Election Counting : ఏపీలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు.
Also Read : AP MPTC–ZPTC Results : బొత్స నుంచి పరిటాల వరకు.. పరిషత్ బరిలో రాజకీయ వారసులు.. ఓటర్ల తీర్పు ఎటువైపు..?
రాష్ట్ర వ్యాప్తంగా 659 జడ్పీ స్థానాలు ఉండగా.. 77 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 582 స్థానాల్లో పోలింగ్ జరిగింది. అదేవిధంగా 9821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 2,051 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 7,767 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకుగాను.. రాష్ట్ర వ్యాప్తంగా 365 లెక్కింపు కేంద్రాల్లో 9062 టేబుళ్లు ఏర్పాటు చేశారు. టేబుల్‌కో కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు. వీరితో పాటు 11,002 మంది అసిస్టెంట్లు సహా 28,500 మంది కౌంటింగ్ సహాయకులు, ఇతర సిబ్బంది.. ఇలా మొత్తం 39,694 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద 40,679 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఫుటేజ్‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పూర్తయిన 60 రోజుల వరకు భద్రపరుస్తుంది.
ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కపెట్టి ఫలితాలు ప్రకటిస్తారు. టేబుళ్లలో 50శాతం ఎంపీటీసీలకు కేటాయించారు. ప్రతి టేబుల్‌కు ఒక్కో రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను లెక్కించడానికి అందజేస్తారు.

