Ball Tampering Scandal: ఆస్ట్రేలియా క్రికెట్‌లో 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం (సాండ్‌పేపర్‌ గేట్‌)పై పెను దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ప్లేయర్స్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దాంతో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఘటన ఇప్పుడు క్రికెట్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బహిరంగంగా మద్దతు తెలిపాడు. కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. తాను కూడా టెస్టు జట్టులో కొనసాగడంపై ఆలోచించాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

2018 బాల్ ట్యాంపరింగ్ ఘటనకు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ ఇటీవల రాసిన 4,000 పదాల వ్యాసం మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది. బంతి ఆకారాన్ని మార్చేందుకు శాండ్‌పేపర్‌ను మైదానంలోకి తీసుకురావడం గురించి బౌలింగ్ విభాగానికి తెలియదన్న వాదనలను ప్రశ్నించాడు. అంతకుముందు మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తన ‘సాబ్ర్’ పుస్తకంలో కేప్‌టౌన్ టెస్టులో శాండ్‌పేపర్ వినియోగం గురించి జట్టులోని అందరికీ తెలుసని పేర్కొన్నాడు. దీంతో అప్పటి ఘటనపై మరోసారి చర్చ మొదలైంది. ఈ పరిణామాలపై స్పందించిన హేజిల్‌వుడ్.. కెప్టెన్ కమిన్స్‌పై వస్తున్న విమర్శలు అన్యాయమని అభిప్రాయపడ్డాడు. గత కొద్ది రోజులుగా పలువురు వ్యక్తులు కమిన్స్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా గత ఐదారు సంవత్సరాల్లో కమిన్స్ చేసిన కృషిని గుర్తించాలని సూచించాడు.

‘ప్యాట్‌ కమిన్స్‌కు, గత వారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు చెప్పిన విషయాలకు నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. కెప్టెన్‌గా గత ఐదారు సంవత్సరాల్లో కమిన్స్‌ చేసిన కృషిని గుర్తించాలి. జట్టును ఉన్నత స్థాయికి తీసుకురావడంతో పాటు ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కమిన్స్‌ గొప్ప నాయకుడు. జట్టులోని ప్రతి ఒక్కరినీ అడిగినా ఇదే సమాధానం వస్తుంది’ అని హేజిల్‌వుడ్ తెలిపాడు. ఒకవేళ కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే మీరు జట్టును వీడే అంశాన్ని పరిశీలిస్తారా? అని అడగ్గా.. హేజిల్‌వుడ్ ఆసక్తికరంగా స్పందించాడు. ‘అలాంటి పరిస్థితి వస్తే అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి వస్తే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిందే’ అని హెచ్చరించాడు.

బాల్ ట్యాంపరింగ్ ఘటనలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలను హేజిల్‌వుడ్ ఖండించాడు. శాండ్‌పేపర్‌తో బంతిని ట్యాంపరింగ్ చేసే ప్రణాళికలో తాను భాగస్వామిని కాదని, మైదానంలో శాండ్‌పేపర్ లేదా ఇతర పదార్థాలను ఉపయోగిస్తున్నారనే విషయం కూడా తనకు తెలియదని స్పష్టం చేశాడు. అనుమానం కలగడం వేరు, వాస్తవంగా విషయం తెలిసి ఉండటం వేరని వివరించాడు. ‘శాండ్‌పేపర్‌తో బంతిని ట్యాంపరింగ్ చేసే ప్రణాళికను రూపొందించడంలో నేను భాగస్వామినా? అంటే కాదు. మైదానంలో శాండ్‌పేపర్ లేదా ఇతర పదార్థాలను ఉపయోగిస్తున్నారని నాకు తెలుసా? అంటే అదీ కాదు. ఈ రెండు విషయాలే అత్యంత కీలకం’ అని హేజిల్‌వుడ్ చెప్పాడు.

కేప్‌టౌన్ టెస్టు జరిగిన వెంటనే దర్యాప్తు అధికారులకు తాను ఇచ్చిన వాంగ్మూలానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని హేజిల్‌వుడ్ తెలిపాడు. అప్పట్లో జరిగిన విషయాలు తనకు స్పష్టంగా గుర్తున్నాయని పేర్కొన్నాడు. ఆట మధ్య విరామాల్లో శాండ్‌పేపర్ వినియోగంపై ఆస్ట్రేలియా జట్టు మొత్తం చర్చించుకుందన్న ఆరోపణలను కూడా హేజిల్‌వుడ్ తోసిపుచ్చాడు. 2018లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మధ్య సరైన సమాచార మార్పిడి లేదని వివరించాడు.ఈ వివాదంలో కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎదుర్కొన్న పరిస్థితులపై హేజిల్‌వుడ్ సానుభూతి వ్యక్తం చేశాడు. అయితే వారికి విధించిన తొమ్మిది, 12 నెలల నిషేధాలు మరీ కఠినమైనవని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ఎవరికైనా అనుమానం రావడం, నిజంగా విషయం తెలిసి ఉండటం రెండూ ఒకటి కాదని స్పష్టం చేశాడు.