Rashmika on Osey Ramulamma Song in Mysaa: రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా 1997లో విడుదలైన ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంలోని టైటిల్ గీతాన్ని రీక్రియేట్ చేశారు. ఈ పాటను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక.. ఐకానిక్ పాటను మళ్లీ తెరకెక్కించడం తమకు ఎంతో పెద్ద బాధ్యతగా అనిపించిందని చెప్పారు.

‘1997లోనే ఎంతో ముందు చూపుతో తెరకెక్కించిన సినిమా ఒసేయ్ రాములమ్మ. అప్పట్లోనే చరిత్ర సృష్టించిన చిత్రం అది. అలాంటి సినిమాలోని టైటిల్ పాటను రీక్రియేట్ చేస్తున్నామని తెలియగానే నా మనసులో కాస్త భయం మొదలైంది. ఎందుకంటే.. ఇది ఒక ఐకానిక్ పాట. ఇలాంటి గీతాన్ని మళ్లీ రూపొందించడం చాలా పెద్ద బాధ్యత. మాతృకలోని పాటను పూర్తిగా మ్యాచ్ చేయలేము. అయితే ఆ గీతానికి న్యాయం చేసేలా మా వంతు ప్రయత్నం చేశాము. ఈ రీక్రియేషన్‌కు వందేమాతరం శ్రీనివాస్ గారు గాత్రం అందించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రష్మిక చెప్పారు.

ఒరిజినల్ పాటకు అప్పట్లో ప్రేక్షకులు ఎంతటి ప్రేమను పంచారో.. ఇప్పుడు తాము రూపొందించిన కొత్త వెర్షన్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నట్లు రష్మిక వెల్లడించారు. ప్రేక్షకులు ఈ పాటను ప్రేమతో స్వీకరించాలని కోరారు. ఒకప్పటి సంచలన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను కొత్త రూపంలో వినిపించేందుకు ‘మైసా’ బృందం చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్మిక వ్యాఖ్యలతో ఈ రీక్రియేటెడ్ సాంగ్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.