హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా హాట్ టాపిక్ అవుతోంది. ఆయనది ప్రేమ వివాహం అని తెలసిందే. కానీ ప్రేమను దక్కించుకోవడానికి ఆరోజుల్లో రేవంత్ రెడ్డి చేసిన సాహసం ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ఈవెంట్ ద్వారా అందరికీ తెలిసింది. దాంతో రేవంత్ రెడ్డి లవర్ బాయ్ మూమెంట్ ట్రెండ్ అవుతోంది.


హైదరాబాద్‌లో నిర్వహించిన ఏబీపీ సమ్మిట్‌లో పలు రాష్ట్ర, జాతీయ రాజకీయ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పెళ్లికి ముందు తన ప్రేమను దక్కించుకునేందుకు బైకు మీద ఢిల్లీకి వెళ్లిన ఆసక్తికరమైన విషయాన్ని హోస్ట్ ప్రస్తావించారు. తన సతీమణి గీతతో ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పి ప్రపోజ్ చెప్పడానికి ఏకంగా హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బైక్‌పై వెళ్లడంపై స్పందించాలని కోరారు. రేవంత్ పాత రోజుల్లో జరిగిన విషయం ఇప్పుడెందుకులెండి? అని 1990ల్లో ప్రేమ కథపై సమాధానం దాటవేశారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రానూపోనూ దాదాపు 3500 కి.మీ పైగా ఉంటుందని, ప్రేమ కోసం అన్ని వేల కిలోమీటర్లు బైక్‌పై వెళ్లి సాహసం ఎలా చేశారని, అంత ఓపిక ఎలా వచ్చిందని హోస్ట్ రేవంత్ రెడ్డిని అడిగారు. ప్రేమలో ఉన్న సమయంలో ఎదురుచూడటం ఎంత కష్టంగా ఉంటుందో.. అది ప్రేమించిన వారికే తెలుస్తుంది. అది నా వ్యక్తిగత విషయం ఇప్పుడు దాన్ని పబ్లిక్ చేయడం ఎందుకండీ అని నవ్వుతూ పాత రోజులను సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడే సీఎం రేవంత్ రెడ్డి లవర్ బాయ్ మూమెంట్ ఈ సందర్భంగా వైరల్ అవుతోంది.