హైదరాబాద్: ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల ఉన్న సంస్థ కార్యాలయాలతో పాటు హైదరాబాద్ కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నేహ గ్రూప్ డైరెక్టర్లు రామ్ రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో ఐటీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
1982లో 'రామ్ రెడ్డి చికెన్ మార్కెట్'గా ప్రారంభమైన ఈ సంస్థ, 1994లో స్నేహ ఫామ్స్ గా విస్తరించి అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఈ గ్రూప్ పౌల్ట్రీ బ్రీడింగ్, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా, సఫల బ్రాండ్ పేరుతో వంట నూనెల తయారీ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో గంటకు 12,000 కోళ్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం గల అత్యాధునిక ఆటోమేటెడ్ ప్లాంట్‌ను ఈ సంస్థ నిర్వహిస్తోందని తెలిసిందే.
2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి వ్యాపారం చేస్తున్న స్నేహ గ్రూప్, భారత రక్షణ సంస్థలకు (డిఫెన్స్) సైతం ఫ్రోజెన్ చికెన్ సరఫరా చేస్తోంది. అంతేకాకుండా, 2024 ఆర్థిక సంవత్సరంలో సింగ్ పౌల్ట్రీని కొనుగోలు చేసిన ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ మిట్సుయి & కో కూడా ఆసక్తి చూపింది. సంస్థ లావాదేవీలు, లెక్కల్లో అవకతవకలు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ శాఖ రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

