హైదరాబాద్: భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ చేసిన 'వోట్ చోర్, గద్దీ ఛోడ్' నినాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎన్నికల కమిషన్‌తో పాటు మతాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, BJPపై ఆయన ఆరోపణలు గుప్పించారు. ABP News నిర్వహించిన 'సదరన్ రైజింగ్ సమిట్'లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో పేదల ఓటు హక్కును కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుందని, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాన్ని ఆయన ప్రస్తావించారు. BJP ధనవంతులకు ఓటు హక్కు ఇవ్వాలని కోరుకుంటోందని, మరోవైపు పేదల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ఎవరు నడపాలో రాజులు నిర్ణయించరని భారత చరిత్ర చెబుతోందన్నారు. అందుకే దేశ పౌరులకు ఓటు హక్కు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఎవరిది అవుతుందో, దేశాన్ని ఎవరు నడుపుతారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. 2014లో ముఖ్యమంత్రి నుంచి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. ఆ తర్వాత మొదట ED, CBIలను ఉపయోగించారని ఆరోపించారు. ఆ తరువాత భాష, కులం పేరుతో ప్రజలను విభజించడానికి ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇప్పుడు ప్రజలు అలాంటి మాటలు వినడం మానేశారని, భయపడటం కూడా ఆపేశారని రేవంత్ రెడ్డి అన్నారు. జంతర్-మంతర్ వద్ద జరిగిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, బాధితులు, దళితులు, పేదలు, ఆదివాసీలు, మహిళలకు ఓటు హక్కు లభిస్తే తాము ఎన్నికల్లో ఓడిపోవచ్చని ప్రధాని మోదీకి అర్థమైందని అన్నారు. అందుకే రెండు రకాల ప్రజలను తయారు చేస్తున్నారని చెప్పారు. ధనవంతులకు ఓటు హక్కు ఇస్తున్నారని, పేదల పేర్లను తొలగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లి అక్కడ భారత్ గురించి మాట్లాడతారని.. అదేవిధంగా ఓ విదేశీయుడు భారత పర్యటనలో మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలను లేవనెత్తితే దానిపై అభ్యంతరం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
భారత్ సమ్మిట్‌లో జియాకోమో ఫిలిబెక్ నినాదం
ఈ నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమిట్‌లో పాల్గొన్న ఇటలీకి చెందిన పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి జియాకోమో ఫిలిబెక్ 'వోట్ చోర్, గద్దీ ఛోడ్' నినాదం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు, ఇతర BJP నేతలు కాంగ్రెస్‌పై ఎదరుదాడి చేశారని తెలిసిందే. భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇలాంటి సభలు, సదస్సులు, శిఖరాగ్ర సమావేశాలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన సవాళ్లపై ఫోకస్ పెంచుతాయన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉత్తమ మార్గం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటమేనని ఫిలిబెక్ అన్నారు. కాంగ్రెస్, ప్రపంచంలోని అనేక ఇతర మిత్రులతో కలిసి తాము ప్రగతిశీల కూటమిలో భాగమని ఫిలిబెక్ స్పష్టం చేశారు. ఈ కూటమి సామాజిక న్యాయం, వాతావరణ న్యాయం, మానవ హక్కులు, నిజమైన ప్రజాస్వామ్యం వంటి విలువలను నమ్ముతుందని పేర్కొన్నారు. అవినీతి, నియంత పాలన కంటే నిజమైన ప్రజాస్వామ్యం అవసరమని చెప్పారు.

