Kulgam Gunfight: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలోని జంగల్పోరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులతో కూడిన సంయుక్త బృందానికి మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. లష్కరే తోయిబా (LeT) టాప్ కమాండర్ లతీఫ్ భట్ ఈ ప్రాంతంలో చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో అతడి కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మానవ నిఘా వర్గాల ద్వారా లభించిన సమాచారంతో లతీఫ్ భట్ జంగల్పోరా ప్రాంతంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల కుల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం అతడి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. తాజాగా ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. నవంబర్ 16న కూడా కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది భద్రతా బలగాల వలయంలో చిక్కుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇటీవల కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమై ప్రాంతవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానిత ఉగ్రవాదుల కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.
మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో కూడా కలకలం చోటుచేసుకుంది. దుర్హామా ప్రాంతంలోని ఓ తోటలో నీటి పైప్‌లైన్ పనులు చేపడుతుండగా మూడు తుప్పుపట్టిన లైవ్ హ్యాండ్ గ్రెనేడ్లు బయటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబు నిర్వీర్య బృందాన్ని అక్కడికి పంపించారు. బాంబు నిర్వీర్య దళం నియంత్రిత పేలుడు ద్వారా ఆ మూడు గ్రెనేడ్లను సురక్షితంగా నిర్వీర్యం చేసింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఉగ్రవాదుల కదలికలు, దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పెంచడంతో పాటు అనుమానితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

