Akvan Cyclone: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరో తుఫాన్ కదులుతోంది.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా బలపడింది. అయితే ప్రస్తుతం ఈ తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అక్వాన్ తీవ్ర తుఫాన్ చెన్నైకి 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఎల్లుండి మధ్యాహ్నానికి నెల్లూరు–విశాఖపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
సహాయక చర్యలకు NDRF, SDRF బృందాలు సిద్ధం
ఇక, అక్వాన్ తుఫాన్ పరిస్థితిని ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ గమనంపై ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF బృందాలు, 11 SDRF బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు.. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ పరిస్థితులపై అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

