Amaravati Capital Development 2027 to 2046 Plan:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా నగరంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక చోదక శక్తిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక సుదీర్ఘ, శాస్త్రీయ ఆర్థిక నమూనాను పట్టాలెక్కించింది. 2027 నుంచి 2046 వరకు రాబోయే 20 ఏళ్ల కాలానికి గాను రాజధాని సమగ్ర నిర్మాణానికి మొత్తం రూ. 1,33,302 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. గతంలో ఎదురైన రాజకీయ అనిశ్చితి, నిధుల కొరత వంటి అడ్డంకులు భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా, రాజధాని నిర్మాణానికి ఒక శాశ్వత ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తాజాగా జీవో నెం. 1397 ద్వారా ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసి కీలక ముందడుగు వేసింది.

అమరావతి  ఒక స్వయం సమృద్ధ నగరం 

ఈ 20 ఏళ్ల మహా ప్రణాళికలో అత్యంత ఆసక్తికరమైన, వ్యూహాత్మకమైన అంశం  ఆర్థిక స్వావలంబన . మొత్తం అంచనా వ్యయం రూ. 1,33,302 కోట్లలో, వివిధ మార్గాల ద్వారా  రూ. 1,05,348 కోట్ల రాబడి సమకూరుతుందని ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇక మిగిలిన  రూ. 27,954 కోట్ల  నిధుల లోటును భర్తీ చేసేందుకు సాధారణ బడ్జెట్ లేదా రాష్ట్ర ఖజానాపై ఆధారపడకుండా వినూత్న ఆర్థిక మార్గాలను ఎంచుకుంది. భూముల విలువ ఆధారిత ఆదాయ వనరులు  , గ్రీన్ బాండ్లు, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ , అలాగే ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో ఈ లోటును అధిగమించి అమరావతిని ఒక స్వయం సమృద్ధ  నగరంగా నిలబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రెడో దశ కోసం నిధుల సమీకరణ 

మరోవైపు, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనను ఏపీసీఆర్డీఏ  అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే  రూ. 90,092 కోట్ల అంచనా వ్యయంతో 129 కీలక ప్రాజెక్టులకు రూపకల్పన జరగగా, అందులో రూ. 41,062 కోట్ల విలువైన 67 ప్రాజెక్టులకు నిధులు సమకూరడంతో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తదుపరి దశలో చేపట్టనున్న మిగిలిన 62 ప్రాజెక్టులకు అవసరమైన రూ. 49,030 కోట్ల నిధుల సమీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం అప్పులపైనే కాకుండా, నగరంలో ఏర్పడే మౌలిక సదుపాయాలు, వాణిజ్య సముదాయాల ద్వారా నిరంతర ఆదాయం సృష్టించబడేలా ఈ ప్రాజెక్టుల నమూనాను తీర్చిదిద్దారు.

ప్రత్యేక కమిటీ నియామకం

ఈ సుదీర్ఘ ఆర్థిక వ్యూహాన్ని పక్కాగా అమలు చేసేందుకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్ సభ్యులుగా, అదనపు కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు. 2046 నాటికి ఏ ఏడాదికి ఎంత మేర నిధులు అవసరమవుతాయి, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, సొంత ఆదాయ మార్గాల పెంపు వంటి అంశాలపై ఈ కమిటీ లోతైన అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా, ఈ ఆర్థిక ప్రణాళికను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దేశ, విదేశీ ఆర్థిక నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛను కూడా ప్రభుత్వం ఈ కమిటీకి కల్పించింది.

రాజధానికి అన్నీ ఇతర నిధులే           

 అమరావతి నిర్మాణం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి నిధులకు ఎలాంటి కోత పడదని, అమరావతి తన సొంత ఆస్తులు, ఆదాయంతోనే నిర్మింస్తున్నరని ప్రజలకు, ప్రతిపక్షాలకు స్పష్టమైన సమాధానం చెప్పడానికి చంద్రబాబు ప్రభుత్వం ఈ 20 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. కమిటీ ఏర్పాటైన నాటి నుంచి  60 రోజుల్లోగా తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ఈ 60 రోజుల నివేదిక ఖరారైతే.. రాబోయే రెండు దశాబ్దాల పాటు అమరావతి అభివృద్ధికి నిధుల కొరత అనే మాటే లేకుండా పోతుంది. రాష్ట్ర ఖజానాపై భారం వేయకుండా, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం, గ్రీన్ బాండ్ల వంటి ఆధునిక ఆర్థిక సాధనాలతో నిర్మించబోతున్న అమరావతి, దేశంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్‌గా చరిత్ర సృష్టించనుంది.