Train: చాలా మంది రాత్రిపూట రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే, రాత్రిపూట రైలులో ప్రయాణించాలి అంటే.. కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. లేకపోతే..మీరే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.
మన దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రయాణానికి రైళ్లనే మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటారు. పగటి ప్రయాణంతో పోలిస్తే రాత్రి సమయాల్లో ప్రయాణించడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వేస్ కొన్ని ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రిపూట రైలులో ప్రయాణించాలంటే కచ్చితంగా పాటించాల్సిన 5 రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
రాత్రి 10 గంటలు దాటిన తర్వాత తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం నిబంధనలకు విరుద్ధం. ఇయర్‌ఫోన్స్ లేకుండా లౌడ్‌స్పీకర్లలో పాటలు వినడం, ఫోన్లలో గట్టిగా అరవడం లేదా పెద్దగా మాట్లాడటం వంటివి చేయకూడదు. ఇది నిద్రపోతున్న మిగతా ప్రయాణికులకు తీవ్రమైన డిస్టర్బెన్స్‌ను కలిగిస్తుంది.
లైట్ల వినియోగంపై ఆంక్షలు
రాత్రి సమయంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోవడానికి వీలుగా కేవలం 'నైట్ లైట్' మాత్రమే ఉపయోగించాలి. మిగతా మెయిన్ లైట్లన్నీ ఆఫ్ చేయడం మంచిది. అర్ధరాత్రిళ్లు ప్రకాశవంతమైన లైట్లు వేయడం వల్ల ఇతరులకు నిద్ర భంగం కలుగుతుంది.
మిడిల్ బెర్త్ నిబంధనలు
రైళ్లలో లోయర్, మిడిల్, అప్పర్ బెర్త్‌ల కేటాయింపుపై స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. మిడిల్ బెర్త్ ప్రయాణికులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తమ బెర్త్‌ను నిద్రపోవడానికి ఉపయోగించుకోవాలి. మిగతా సమయాల్లో మిడిల్ బెర్త్‌ను మడతపెట్టి ఉంచాలి. అలాగే, రాత్రి 10 తర్వాత లోయర్ బెర్త్ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనలు పాటించాలి.
రాత్రిపూట ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు..
చాలా వరకు ట్రైన్లలో రాత్రి 10 గంటల తర్వాత ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ లేదా ఫుడ్ సర్వీస్ నిలిచిపోతాయి. కాబట్టి మీకు రాత్రి సమయంలో ఆకలి వేస్తే ముందుగానే డిన్నర్ ప్లాన్ చేసుకోవడం లేదా ఈ-కేటరింగ్ ద్వారా ముందే ఫుడ్ ఆర్డర్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం.
మొబైల్, లాప్‌టాప్ ఛార్జింగ్..
చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాత్రి 11 గంటల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఛార్జింగ్ పాయింట్ల వద్ద పవర్ సప్లై నిలిపివేస్తారు. కాబట్టి రాత్రి 11 గంటలలోపే మీ మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర గ్యాజెట్లను ఛార్జ్ చేసుకుని ఉంచుకోవడం చాలా ముఖ్యం.
రైలు ప్రయాణం అందరిదీ.. తోటి ప్రయాణికుల సౌకర్యాన్ని గౌరవిస్తూ, ఈ చిన్న చిన్న రైల్వే రూల్స్‌ను పాటిస్తే మన ప్రయాణం ఎంతో సురక్షితంగా, ప్రశాంతంగా సాగిపోతుంది.

