Harish Rao Open Letter to CM Revanth Reddy Siddipet Funds: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, బీఆర్ఎస్ పార్టీకి అభేద్యమైన కంచుకోటగా భావించే సిద్దిపేట నియోజకవర్గం ఇప్పుడు హై-వోల్టేజ్ రాజకీయ సమరానికి వేదికగా మారింది. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డపై నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా విపక్ష శిబిరంలో నేరుగా ప్రకంపనలు సృష్టించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోనే కాంగ్రెస్ జెండాను బలంగా ఎగురవేయడం ద్వారా, ప్రతిపక్ష నేతలపై మానసిక, రాజకీయ ఒత్తిడిని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
హరీష్ రివర్స్ ఎటాక్
అయితే, ముఖ్యమంత్రి పర్యటనకు ముందే మాజీ మంత్రి హరీశ్ రావు ముందస్తు రాజకీయ దాడికి దిగడం సిద్దిపేట వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. సోమవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడంతో పాటు, సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘమైన బహిరంగ లేఖను విడుదల చేస్తూ హరీశ్ రావు ఘాటైన విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటకు మంజూరైన రూ. 1,070 కోట్ల విలువైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కాలేజీని సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు తరలించుకుపోయారని, రాష్ట్రవ్యాప్తంగా 87 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసి సిద్దిపేటను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని ఆయన మండిపడ్డారు.
నిధుల కోసం డిమాండ్
అంతేకాకుండా, గత పర్యటనల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను హరీశ్ రావు తన బహిరంగ లేఖలో ప్రత్యేకంగా ఎత్తిచూపారు. 2024 మే నెలలో సిద్దిపేట పాత బస్టాండ్ సభలో ఆగస్టు 15 నాటికి రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, నియోజకవర్గంలో ఇంకా వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే, 2026 మార్చిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 45 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కొడంగల్‌లో మిమ్మల్ని ఓడించానన్న కోపం నాపై ఉండాలి కానీ, సిద్దిపేట ప్రజలు ఏం పాపం చేశారు? ఆ హామీలను నెరవేర్చి, నిలిపివేసిన నిధులను విడుదల చేసి వస్తే నేనే స్వయంగా బొకే ఇచ్చి స్వాగతం పలుకుతాను అని హరీశ్ రావు సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
మరోవైపు, హరీశ్ రావు విమర్శలను తిప్పికొడుతూ, సీఎం సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారని, కాళేశ్వరం విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. సిద్దిపేట అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించేలా, నవంబర్ 19న జరగనున్న సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాకు పలు కీలక అభివృద్ధి పనులు, కొత్త నిధులను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
హరీష్‌పై ముప్పేట దాడి
ఒకవైపు కల్వకుంట్ల కవిత సిద్దిపేట కేంద్రంగా హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే గడ్డపై బహిరంగ సభ నిర్వహించడం బీఆర్ఎస్కు సవాలుగా మారింది. అందుకే, సీఎం సభ జరగకముందే సిద్దిపేటపై వివక్ష అనే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా రేవంత్ రెడ్డి సభ ప్రభావాన్ని తగ్గించాలని హరీశ్ రావు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య వ్యూహానికి, హరీశ్ రావు సెంటిమెంట్ అస్త్రానికి మధ్య నవంబర్ 19న సిద్దిపేటలో జరగబోయే సభ తెలంగాణ రాజకీయాలకు ఒక కీలక మలుపుగా నిలవనుంది. హరీశ్ రావు సంధించిన బహిరంగ లేఖ ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎలాంటి సమాధానం ఇస్తారు, సిద్దిపేట ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎలాంటి వరాలు ప్రకటిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

