Bellampalli Police Farmhouse Party Ramagundam CP Attaches 5 Police to Headquarters Action Against 9 Others
మంచిర్యాల: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, డిపార్ట్మెంట్ క్రమశిక్షణను ఉల్లంఘించిన బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. డ్యూటీలో ఉండాల్సిన సమయంలో రిజిస్టర్లో సంతకం చేసి, బాధ్యతలను విస్మరించి ఫాం హౌస్‌లో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేయడంతో పోలీస్ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఘటనకు బాధ్యులైన ఐదుగురు సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. మరో 9 మంది పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ తమ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో కూడిన, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధ్యతలను విస్మరించడం ఏమాత్రం సహించరాని విషయమన్నారు. ప్రతి ఒక్కరూ శాఖ గౌరవ ప్రతిష్టలను కాపాడేలా వృత్తిపరమైన నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో విధుల్లో నిర్లక్ష్యం వహించినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా లేదా శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా ఆ పోలీసులపై చర్యలు తప్పవని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.

డ్యూటీ వదిలేసి బర్త్‌డే పార్టీకి వెళ్లి పోలీసులు స్టెప్పులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పలువురు పోలీసులు, మహిళా సిబ్బంది ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా ఓ ప్రైవేట్ బర్త్‌డే పార్టీకి వెళ్లడం కలకలం రేపింది. కనీసం స్టేషన్ రికార్డుల్లో మూవ్మెంట్ ఎంట్రీ కూడా నమోదు చేయకుండా, డ్యూటీ సమయంలో పట్టణ పరిధి దాటి తాండూరు మండలం కత్తెర్ల వద్ద ఉన్న ఒక ఫామ్ హౌస్‌కు వెళ్లి అక్కడ లిక్కర్ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెయిన్ డ్యాన్స్‌లు చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో స్టెప్పులేస్తూ జల్సా చేశారు. మహిళా పోలీసులు సైతం ఈ వేడుకల్లో పాల్గొని చిందులేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం, మంత్రులు, ఉన్నతాధికారులు పదేపదే సూచిస్తుంటే, బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు మాత్రం ఆన్ డ్యూటీలో ఉండి కూడా విధులకు డుమ్మా కొట్టి రెయిన్ డ్యాన్సులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసుల విందు వినోదాలు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు లీక్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.

ఈ వ్యవహారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం మేరకు 14 మంది పోలీస్ సిబ్బంది ఈ బర్త్ డే పార్టీకి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ఎవరెవరు వెళ్లారు, వీరికి అనుమతి ఎవరిచ్చారు, వారంతా ఆన్ డ్యూటీలో ఉన్నారా లేక సెలవు తీసుకున్నారా అనే అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరిపారు.

