Gudivada Politics : రెండో విడత మున్సిపల్ ఎన్నికల వేళ అందరి దృష్టి గుడివాడపైనే ఉంది. మాజీమంత్రి కొడాలినాని ఇలాకాగా ఉన్న గుడివాడలో 2024 వరకు నాలుగుసార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చారాయన. రెండుసార్లు టీడీపీ.. రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి తిరిగి నియోజక వర్గంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఆధిక్యం సాధించడంతో మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపుతో తన బలం నిరూపించుకోవాలని కొడాలి నాని రంగంలోకి దిగారు.

Also Read : Akwan Cyclone : అక్వాన్ తుపానుపై కీలక అప్డేట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. భీకర గాలులు, భారీ వర్షాల హెచ్చరికలు..

రాష్ట్రంలో 23 పట్టణ సంస్థలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో గుడివాడ మున్సిపాలిటీ ఒకటి కావడం.. కొడాలి నాని పరువు నిలబెట్టుకొనేందుకు ఆరాటపడుతుండటం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే ఆ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని అడ్డాగా మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించిన టీడీపీ ఇప్పుడు మున్సిపల్ పీఠాన్ని కూడా సొంతం చేసుకునేలా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ ఛాలెంజ్‌గా మారాయన్న చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల సమయంలో తాను మళ్లీ పోటీచేయనని చెప్పినప్పటికీ కూటమి వేవ్‌లో ఆయనకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత నానిని కేసులు చుట్టు ముట్టాయి. సేమ్‌టైమ్‌ అనారోగ్యానికి గురికావడంతో కొన్నాళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయారు. స్థానిక ఎన్నికల హడావుడితో మళ్లీ యాక్టివ్ అయిన నాని గుడివాడలో తన సత్తా ఏంటో చూపుతానని ప్రకటనలు చేశారు. అయితే, పరిషత్ ఎన్నికల్లో ఆయన సత్తా చాటలేకపోయారు. దాదాపు 97 శాతం స్ట్రైక్ రేటుతో టీడీపీ కూటమి గుడివాడ నియోజక వర్గంలో హవా చూపించింది.

గుడవాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. కానీ ఈ సారి ఆ రికార్డు కూడా బద్దలైంది. గతంలో ఎన్నడూ గెలవని నందివాడ ఎంపీపీ పీఠంతో పాటు జడ్పీటీసీ సీటును గెలుచుకొని టీడీపీ సరికొత్త రికార్డు నమోదు చేసిందని చెబుతున్నారు. గుడివాడ నియోజక వర్గంలో 32 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలు కూడా టీడీపీ పరమయ్యాయి. దీంతో గుడివాడలో కొడాలి నాని పట్టు సడలిందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారాయన. గుడివాడ మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని..తన పట్టు సడలలేదని నిరూపించుకోవాలని నాని తాపత్రయపడుతున్నారు. చైర్మన్‌ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు.

పరిషత్ ఎన్నికలతో ఊహించని పరాభవం ఎదుర్కొన్న మాజీ మంత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చూపుతారోనన్న ఆసక్తి నెలకొంది. చైర్‌పర్సన్ అభ్యర్థి కరుణ నామినేషన్ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపించడంతో కొడాలి నానికి ఊపిరి వచ్చిందని అంటున్నారు. అయితే, 12 ఏళ్లుగా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం, వార్డుల వారీగా ఎవరి బలం ఎంత అనే అంచనా లేకపోవడం ఇబ్బందికరంగా మారిందట. అయితే గుడివాడ ప్రజల దాహర్తిని తీర్చిన నాయకుడిగా నానికి ఉన్న పేరు.. గుడివాడ పట్టణంలో ఆయనకున్న విస్తృత పరిచయాల మీదే హోప్ పెట్టుకున్నారట. పురపోరులో నాని తన బలమేంటో చూపిస్తారా.? లేక అధికార కూటమినే పరిషత్ ఫలితాలను రిపీట్ చేస్తుందా అనేది ఈ నెల 26 తర్వాత క్లారిటీ రానుంది.