SAFF Championship 2026: దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన సాఫ్ (SAFF) ఛాంపియన్‌షిప్ 2026 ఫైనల్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-1 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం ఢాకాలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో వెనుకబడిన భారత్.. రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుని విజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ తన ఖాతాలో రికార్డు స్థాయిలో 10వ సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను చేర్చుకుంది. అంతేకాకుండా వరుసగా మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.

మ్యాచ్ ప్రారంభం నుంచి పాకిస్థాన్ దూకుడుగా ఆడింది. భారత డిఫెన్సివ్ లైన్ ఇబ్బంది పెడుతూ పలుమార్లు గోల్ చేసే అవకాశాలను సృష్టించింది. ఈ క్రమంలో 45వ నిమిషంలో అలంగీర్ ఘాజీ అద్భుతమైన గోల్‌తో పాకిస్థాన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పాకిస్థాన్ ఆధిక్యంలో నిలిచింది. భారత్ కూడా గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ పాకిస్థాన్ గోల్‌కీపర్ యూసుఫ్ బట్ అడ్డుకున్నాడు. ముఖ్యంగా రికీ షబాంగ్ చేసిన శక్తివంతమైన షాట్‌ను అద్భుతంగా నిలువరించాడు.

రెండో అర్ధభాగం ప్రారంభమైన తర్వాత భారత జట్టు ఆటతీరులో మార్పు కనిపించింది. మాక్‌కార్టన్ నిక్సన్‌ను మైదానంలోకి తీసుకురావడంతో భారత దాడులు మరింత వేగం పుంజుకున్నాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బ్రైసన్ ఫెర్నాండెజ్‌పై ప్రమాదకరంగా టాకిల్ చేయడంతో VAR సమీక్ష అనంతరం జునైద్ షాకు రెడ్ కార్డు చూపించారు. దీంతో పాకిస్థాన్ 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని భారత్ వెంటనే సద్వినియోగం చేసుకుంది. 56వ నిమిషంలో లుంగ్డిమ్ అందించిన క్రాస్‌ను సద్వినియోగం చేసుకున్న సుహైల్ అహ్మద్ భట్ అద్భుతంగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది.

సమం చేసిన తర్వాత భారత్ మరింత దూకుడుగా ఆడింది. వరుస దాడులతో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచింది. చివరకు 87వ నిమిషంలో రబీహ్ అందించిన కార్నర్‌ను సందీప్ మండి హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. బంతి గోల్‌కీపర్ యూసుఫ్ బట్‌ను దాటి నెట్‌లోకి వెళ్లడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో పాకిస్థాన్ సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే భారత ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. లుంగ్డిమ్ చేసిన మరో ప్రయత్నాన్ని సమద్ గోల్‌లైన్‌పై అడ్డుకోవడంతో భారత్‌కు ఊరట లభించింది.

చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత జట్టు 2-1తో విజయాన్ని అందుకుంది. దీంతో సాఫ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తన 10వ టైటిల్‌ను గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు తొలిసారిగా ఫైనల్‌కు చేరిన పాకిస్థాన్‌కు తొలి టైటిల్ కల నెరవేరలేదు. తొలి అర్ధభాగంలో వెనుకబడినా పట్టుదలతో పోరాడి విజయం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

🏆🇮🇳 India rules the SAFF football stage once again!

Team India came frm behind to beat Pakistan 2-1 in the final in Dhaka, securing a record 10th SAFF Championship title & completing a historic three-peat.

Suhail Ahmed Bhat brought India level b4 Sandip Mandi’s 88th-min header sealed the trophy. What a comeback! 🔥

#IndianFootball #SAFFChampionship #TeamIndia

— Shiv (@HeyShivu) November 17, 2026