37 ఏళ్ల అక్షిత జైన్ ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం ఫియట్, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల్లో పనిచేశారు. ఆమె చివరిగా ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అక్కడ ఆమె వార్షిక వేతనం సుమారు రూ.50 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇంత మంచి ఉద్యోగం, భారీ జీతం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ అక్షిత తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నారు. కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా ఉంటూ జైన మత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

AI టెక్నాలజీపై పనిచేస్తూ ఆలోచనలో మార్పు!

అక్షిత తన కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు సంబంధించిన పనులు చేస్తున్న సమయంలో ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన డేటా సెంటర్ల నిర్మాణం పర్యావరణంపై చూపే ప్రభావం ఆమెను ఆలోచింపజేసింది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం భూమిని తవ్వడం, ప్రకృతికి నష్టం కలగడం, నేలలో ఉండే సూక్ష్మ జీవులకు హాని కలిగే అవకాశాలపై ఆమె ఆందోళన చెందారు. జైన మతంలోని అహింసా సిద్ధాంతం ఆమెను బాగా ప్రభావితం చేసింది. ప్రతి జీవిపై దయ చూపడం, ఏ జీవికి హాని కలిగించకుండా జీవించడం అనే జైన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతో సన్యాస జీవితాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

61 ఏళ్ల వయసులో తల్లి కూడా అదే బాటలో!

అక్షిత తల్లి శిరోమణి బజాజ్ కూడా కుమార్తెతో కలిసి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)లో సుమారు 37 ఏళ్లపాటు పనిచేశారు. చీఫ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించి 2025 అక్టోబర్‌లో పదవీ విరమణ చేశారు. భర్త మరణం, కుటుంబ బాధ్యతలను పూర్తి చేసిన అనంతరం ఆమెకు జైన ఆధ్యాత్మికతపై ఆసక్తి మరింత పెరిగింది. జైన సాధ్వీలతో పరిచయం ఏర్పడటంతో ఆధ్యాత్మిక జీవన విధానం వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే 61 ఏళ్ల వయసులో కుమార్తెతో కలిసి జైన సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ తల్లీకూతుళ్లు జైన ఆధ్యాత్మిక గురువు సాధ్వి పూర్ణప్రజ్ఞశ్రీ మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు. దీక్ష స్వీకరణకు ముందు శిరోమణి పలు మతపరమైన ఆచారాలు, కఠినమైన తపస్సులను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. దీక్ష కార్యక్రమాల్లో భాగంగా జోధ్‌పూర్‌లో సంప్రదాయ జైన ఊరేగింపు (వర్ఘోడా) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం ఫిబ్రవరి 25న చెన్నైలో దీక్ష కార్యక్రమం జరగాల్సి ఉంది.

జైన మతంలో దీక్ష అంటే ఏమిటి?

జైన మతంలో దీక్ష అనేది సాధారణ మతపరమైన కార్యక్రమం కాదు. ఇది జీవితంలో పూర్తిస్థాయి మార్పుకు సూచిక. దీక్ష స్వీకరించిన వ్యక్తులు ప్రాపంచిక ఆస్తులు, సుఖాలు, కుటుంబ బంధాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సాధనకు అంకితమవుతారు. అహింస, సత్యం, అపరిగ్రహం వంటి జైన సిద్ధాంతాలను పాటిస్తూ సన్యాస జీవితం కొనసాగిస్తారు. ఒకవైపు రూ.50 లక్షల వార్షిక వేతనంతో అంతర్జాతీయ కంపెనీలో పనిచేసిన అక్షిత.. మరోవైపు 37 ఏళ్లపాటు ప్రభుత్వ రంగ సంస్థలో సేవలందించిన ఆమె తల్లి.. ఇద్దరూ తమ జీవితాల్లో సాధించిన విజయాలను, సౌకర్యాలను వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.