హైదరాబాద్‌, నవంబర్ 18: తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రతిపాదనపై మరో 15 రోజుల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థ పరిధిలోకి రానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి 9-12 తరగతులతో కూడిన సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2029-30 నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలను సమీకృత పాఠశాలలుగా మార్చాలని యోచిస్తోంది.

ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం ఎందుకు?

పదో తరగతి పూర్తయిన తర్వాత చాలా మంది విద్యార్థినులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో 17.90 శాతం మంది అమ్మాయిలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాలల్లోనే విద్య అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి తర్వాత కూడా విద్యార్థులు అదే విద్యా వ్యవస్థలో కొనసాగేందుకు వీలుగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ విద్య విలీనం తర్వాత ప్రత్యేకంగా సీనియర్ సెకండరీ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డుకు ఐఏఎస్ అధికారి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. బోర్డు పరిధిలో రెండు పరీక్షల విభాగాలు ఉంటాయి.

  • పరీక్షల విభాగం-1: పదో తరగతి పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూస్తుంది.
  • పరీక్షల విభాగం-2: 11, 12వ తరగతుల పరీక్షలను నిర్వహిస్తుంది.
  • అకడమిక్ విభాగం: విద్యా సంబంధిత అంశాలు, అనుబంధ గుర్తింపులు తదితర ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది.

దీంతో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య మధ్య పరిపాలనా సమన్వయం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరు దశల్లో విలీన ప్రక్రియ

ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియను మొత్తం ఆరు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

  • చట్టాల విలీనం: పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖకు సంబంధించిన రెండు చట్టాలను ఒకే చట్టంగా మార్చడం.
  • కొత్త బోర్డు ఏర్పాటు: స్వయంప్రతిపత్తి కలిగిన సీనియర్ సెకండరీ బోర్డును ఏర్పాటు చేయడం.
  • ఆర్థిక మార్పులు: సీనియర్ సెకండరీ పాఠశాలలకు బడ్జెట్, ఇతర ఆర్థిక అవసరాల కోసం డీడీఏ కోడ్‌లను మార్చడం.
  • అధికారుల పరిధిలో మార్పులు: ఇంటర్మీడియట్ విద్యాశాఖలోని డీఐఈఓలను డీఈఓ పరిధిలోకి తీసుకురావడం.
  • ప్రభుత్వ కళాశాలల్లో కొత్త తరగతులు: రెండు విడతల్లో ప్రభుత్వ కళాశాలల్లో పాఠశాల తరగతులను ప్రారంభించడం.
  • ప్రైవేట్ కళాశాలలకు అవకాశం: మూడేళ్లలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 8-10వ తరగతులను కూడా ప్రారంభించుకునేలా అవకాశం కల్పించడం.

430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మారనున్నాయి

ప్రస్తుతం రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిని సీనియర్ సెకండరీ స్కూళ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 2027-28 విద్యా సంవత్సరానికి 96 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా (TG Public Schools) అప్‌గ్రేడ్ చేయనున్నారు. రెండో దశలో 2028-29, 2029-30 విద్యా సంవత్సరాల్లో ట్విన్ క్యాంపస్ మోడల్‌ను అమలు చేయనున్నారు. ఈ విధానంలో హైస్కూల్, జూనియర్ కళాశాలలు రెండు వేర్వేరు ప్రాంగణాల్లో ఒకే విద్యా వ్యవస్థలో కొనసాగుతాయి. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని హైస్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మ్యాపింగ్ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 260 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు హైస్కూళ్లకు కిలోమీటరు పరిధిలోపు ఉన్నట్లు గుర్తించారు. హైస్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సమీపంలోని జూనియర్ కళాశాలలో 11వ తరగతిలో చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు. తద్వారా విద్యార్థులు పదో తరగతి తర్వాత విద్యను కొనసాగించేందుకు సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలను 2029-30 విద్యా సంవత్సరం నాటికి సమీకృత పాఠశాలలుగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలు సేకరించిన అనంతరం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థతో పాటు పాఠశాలల నిర్వహణ, పరీక్షల విధానం, పరిపాలనా నిర్మాణంలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.