World Deepest Metro station: ఒక మెట్రో రైలు ఎక్కడానికి.. ఏకంగా 10 ఎస్కలేటర్స్ ఎక్కి..కిందకు వెళ్లాలి. వినడానికి వింతగా ఉన్నా అదే నిజం. ప్రపంచంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ ఇది. మరి, ఇది ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా చాలా ప్రదేశాల్లో సబ్ వే లేదా మెట్రో స్టేషన్ అంటే భూమికి రెండు, మూడు అంతస్థుల లోతులో ఉంటుంది. ఎస్కలేటర్ ఎక్కి కిందకు వెళ్తే ప్లాట్ ఫామ్ వస్తుంది. మళ్లీ అదే ఎక్కి పైకి వస్తే.. బయట ఉన్న రోడ్డు కనిపిస్తుంది. కానీ, ఒక మెట్రో స్టేషన్ లోకి అడుగుపెట్టి, ఏకంగా 10 ఎస్కలేటర్లు దిగి లోపలికి వెళ్తే తప్ప.. మెట్రో స్టేషన్ రాదు. తీరా మెట్రో నుంచి బయటకు వస్తే.. మెయిన్ రోడ్డు కనపడుతుంది. ఇలాంటి వింత మెట్రో స్టేషన్ చైనాలో ఉంది. చైనాలోని చోంగ్ కింగ్ నగరంలో ఉంది ఈ మెట్రో స్టేషన్. దీని పేరు హాంగ్ యాన్ కన్ మెట్రో స్టేషన్. మరి, దీని విశేషాలు ఏంటో చూద్దాం....

2022లో ప్రారంభమైన ఈ హాంగ్ యాన్ కన్ మెట్రో స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ గా రికార్డు సృష్టించింది. ఈ స్టేషన్ భూమికి ఏకంగా 116 మీటర్లు అంటే సుమారు 380 అడుగుల లోతులో ఉంటుంది. అంటే, దాదాపు ఒక 40 అంతస్తుల భవనాన్ని భూమిలోకి తవ్వితే..ఎంత లోతు ఉంటుందో.. ఈ మెట్రో ఫ్లాట్ ఫామ్ కూడా అంతే లోతుగా ఉంటుందన్నమాట.

ఈ స్టేషన్ ప్లాట్‌ఫామ్‌ను చేరుకోవడానికి ప్రయాణికులు ఏకంగా 10 సుదీర్ఘమైన ఎస్కలేటర్లు దాటాల్సి వస్తుంది. ఎస్కలేటర్లపై ప్రయాణించడానికే దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుందంటే ఇది ఎంత లోతులో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ స్టేషన్‌ను సందర్శించే ప్రయాణికులకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. పది ఎస్కలేటర్లు దిగి కిందకు వెళ్ళి, తిరిగి బయటకు రావడానికి మళ్ళీ పది ఎస్కలేటర్లు ఎక్కి పైకి వచ్చినా.. వారు ఇంకా రోడ్డు లెవెల్‌లోనే ఉంటారు.

దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ చోంగ్‌కింగ్ నగరం క్లిష్టమైన భౌగోళిక అమరిక కావడం విశేషం. చోంగ్‌కింగ్ నగరం సమతలమైన భూమిపై కాకుండా, నిటారైన కొండలు, లోయల మధ్య విస్తరించి ఉంటుంది. సాంప్రదాయ మెట్రోల లాగా ఫ్లాట్ రోడ్డు కింద కాకుండా, ఒక భారీ కొండ రాతి పొరలను చీల్చుకుంటూ ఈ స్టేషన్‌ను నిర్మించారు.

ఏటవాలు ప్రదేశం: ఈ కొండ ఉపరితలం తీవ్రమైన ఏటవాలుగా ఉంటుంది. మెట్రో ట్రాక్ కొండ ఒక వైపున 116 మీటర్ల లోతులో ఉంటే, ప్రయాణికులు ఎస్కలేటర్లు ఎక్కి పైకి వచ్చేసరికి ఆ కొండ శిఖరంపై ఉన్న వేరొక రోడ్డు పైకి చేరుకుంటారు. అందుకే ప్రయాణికులు ఎంత లోతుకి వెళ్ళి బయటకు వచ్చినా, భూగర్భంలో కాకుండా కొండపై ఉన్న మరో వీధిలోకి అడుగుపెడతారు.

View this post on Instagram

A post shared by Nikhil Jain | Bangalore Content Creator (@nikhilskhabiya)

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మెట్రో స్టేషన్....

అన్నీ అనుకూలంగా ఉన్న ప్రదేశంలో అన్ని సదుపాయాలతో మెట్రో నిర్మించడం చాలా తేలిక. కానీ, ఇలాంటి క్లిష్టమైన కొండ ప్రాంతాలలో సైతం పాతాళంలోకి మెట్రో మార్గాలను తవ్వి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్రో నిర్మించిన ఘనత చైనా ఇంజినీర్లకే దక్కింది. ఈ మెట్రో స్టేషన్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మనమంతా 2026లో ఉంటే.. చైనా మాత్రం 3026లో ఉంది అని కామెంట్స్ చేస్తుండటం విశేషం.