Kolkata-Sairang Express Derails: అస్సాంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి సమీపంలోని డిగారు రైల్వే స్టేషన్ వద్ద కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక ప్రకటనలో ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. తాజా అధికారిక సమాచారం ప్రకారం ప్రయాణికులెవరూ గాయపడలేదు. అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ మెట్రో జిల్లాలో బుధవారం (నవంబర్ 11, 2026) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మిజోరం రాష్ట్రంలోని సైరాంగ్ నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న 13125 నంబర్ కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ డిగారు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.

రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిగారు రైల్వే స్టేషన్‌లో మరో రైలుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రైలు వేగాన్ని లోకో పైలట్ నియంత్రించలేకపోవడంతో పట్టాలు తప్పినట్లు ప్రాథమిక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 11న ఉదయం 6:54 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలు, ఇతర కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రైలులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నారని, ఇప్పటివరకు ఎలాంటి గాయాలు నమోదు కాలేదని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేశారు. కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ రైలు ద్వారా తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.