అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం జెర్సీ సిటీలో ఉన్న ఇండియా స్క్వేర్, ఇండియా స్ట్రీట్ ప్రాంతంలో భారతీయులు దీపావళి వేడుక జరుపుకున్నారు. వీడియోను కేశవ్ చెరుక్ అనే భారతీయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో బాణసంచా కాల్చిన తర్వాత రోడ్లపై ఎక్కడ చూసినా ఖాళీ బాణసంచా పెట్టెలు, కార్డ్‌బోర్డ్ ముక్కలు, కవర్లు, బూడిద కనిపించాయి. రోడ్డు మొత్తం చెత్తతో నిండిపోగా ఫైర్ సిబ్బంది భారీ పైప్‌లతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పండుగలు జరుపుకోవడం సంతోషమే కానీ వేడుకలు పూర్తయ్యాక పరిసరాలను శుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా ఉందని వ్యాఖ్యానించారు. చెత్తను రోడ్లపై వదిలేసిన వారిపై భారీ జరిమానాలు విధించాలని, లేదంటే వారితోనే శుభ్రం చేయించాలని మరికొందరు డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి నిబంధనలను, పరిశుభ్రతను గౌరవించాలని సూచించారు.

View this post on Instagram

A post shared by Kesav Cheruk (@kesavcheruk)

ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లడం వెనుక  కారణం ఇదే!

వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని పోస్ట్ చేసిన కేశవ్ మరో వీడియో ద్వారా అసలు విషయం వివరించారు. జెర్సీ సిటీలో దీపావళి వేడుకలను ముందస్తు అనుమతితో నిర్వహించారని చెప్పారు. అధికారులు ముందుగానే బాణసంచా కాల్చేందుకు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించారని రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇచ్చారని అన్నారు.

వేడుకల సమయంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లడాన్ని చూసి కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, బాణసంచా కాల్చడం పూర్తయిన తర్వాత నిప్పురవ్వలు మిగిలి ఉండే అవకాశం ఉందని, వాటి వల్ల మంటలు చెలరేగకుండా నీళ్లను చల్లడం సాధారణ భద్రతా చర్యల్లో భాగమని వివరించారు. అంటే వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పడానికి ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లడం ఆధారం కాదని స్పష్టం చేశారు.

చెత్తను తొలగించేందుకు ముందే ఏర్పాట్లా?

రోడ్లపై బాణసంచా వ్యర్థాలు కనిపించడంపై కూడా కేశవ్ వివరణ ఇచ్చారు. వేడుకలు ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు నిర్వాహకులు ముందుగానే ఏర్పాట్లు చేశారని ఇందుకోసం ప్రత్యేక క్లీనింగ్ ఫీజుతో పాటు అవసరమైన ఇతర ఛార్జీలు కూడా చెల్లించినట్లు చెప్పారు. కాబట్టి వీడియోలో కనిపించిన చెత్తను చూసి భారతీయులు నిబంధనలు పాటించలేదని నిర్ణయానికి రావద్దని కోరారు. ఈ ఘటనను భారతీయ సంస్కృతితో ముడిపెట్టి విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడం సరికాదని సూచించారు. వేడుకలు సజావుగా జరిగేందుకు సహకరించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది, శుభ్రత పనుల్లో పాల్గొన్న వారిని గౌరవించాలని కోరారు.